పుజారా సెంచరీ : భారీ స్కోరు దిశగా భారత్…….
Spread the love

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా సూపర్ సెంచరీ సాధించాడు. అతడికి కోహ్లీ కూడా చక్కని సహాకారం అందిస్తున్నాడు. ఇక దాని ఫలితంగా భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. మిస్టర్ డిపెండబుల్ బ్యాట్స్‌మన్ పుజారా కెరీర్‌లో 17వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 280 బంతులను ఎదుర్కొన్న అతడు.. 10 ఫోర్లతో సిరీస్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు. అంతేకాదు, విదేశాల్లో ఒక సిరీస్‌లో తన అత్యధిక స్కోరు(309)ను దాటాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 320 పైచిలుకు పరుగులు చేశాడు.

ఓవర్ నైట్ స్కోరు 215/2తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్‌కు పుజారా-కోహ్లీ జోడీ శుభారంభం ఇచ్చింది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే.. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ 20వ హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోడీ ఇప్పటికే అజేయంగా 148 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రస్తుతం భారత్ 115 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. పుజారా 100, కోహ్లీ 68 పరుగులతో క్రీజులో ఉన్నారు.