రషీద్‌పై ప్రసంశల వర్షం
Spread the love

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో ఆతిధ్య జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఎంతో ఉత్కంఠ కలిగించిన ఈ పోరులో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించలేక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఓటమిని మూటకట్టుకుంది. సన్‌రైజర్స్ స్పిన్‌మాంత్రికుడు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అటు బ్యాటింగ్‌లో 10 బంతుల్లో 34 పరుగులు చేసి, ఇటు బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి 19 పరుగులు మాత్రమే ఇచ్చిన రషీద్‌ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఫైనల్లో చోటే లక్ష్యంగా ఛేదన కోసం బరిలోకి దిగిన కోల్‌కతాకు అదిరే ఆరంభం లభించింది. 13 ఓవర్ల వరకు బాగానే ఆడినట్టు కనిపించినా ఆ తర్వాతే గతి తప్పింది. రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మాయకు షకీబ్‌, బ్రాత్‌వైట్‌ మెరుగైన బౌలింగ్‌ తోడవడంతో కోల్‌కతా దెబ్బతింది. అంతకుముందు భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సునీల్‌ నరైన్‌ వరుసగా 4,6,4,4తో చెలరేగి 19 పరుగులు రాబట్టాడు. అయితే ఆ వెంటనే సిద్ధార్థ్‌ కౌల్‌ బౌలింగ్‌లో అతడు అవుటైనా కోల్‌కతా 20 బంతుల్లో 40 పరుగులు చేయగలిగింది. వన్‌డౌన్‌లో దిగిన రాణా రెండు సిక్సర్లతో తన ఫామ్‌ను అందుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 67 పరుగులు సాధించింది. ఎనిమిదో ఓవర్‌లోనూ లిన్‌ ధాటిగా ఆడుతూ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో రాణా రెండో రన్‌ కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 47 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్ల అనంతరం ఊతప్ప (2) రషీద్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్‌కు యత్నించి బౌల్డ్‌ కాగా తన తర్వాతి ఓవర్‌లోనే ప్రమాదకర రస్సెల్‌ (3)ను పెవిలియన్‌కు చేర్చి ప్రత్యర్థికి షాక్‌ ఇచ్చాడు. నాలుగు ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా రాకపోగా 16వ ఓవర్‌లో గిల్‌ ఫోర్‌, చావ్లా సిక్సర్‌ కొట్టి స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. 19వ ఓవర్‌లో చావ్లా వెనుదిరిగాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 19 పరుగులు అవసరమైన దశలో బ్రాత్‌వైట్‌ వరుస బంతుల్లో శివమ్‌ మావి (6), గిల్‌లను అవుట్‌ చేయడంతో కోల్‌కతా పరాజయం ఖాయమైంది.

చివరి ఓవర్లలో కోల్‌కతా బౌలింగ్‌కు రషీద్ ఖాన్ బ్యాట్‌కు మధ్య హోరాహోరీ సమరం సాగింది. 16వ ఓవర్ తొలి బంతికి షకీబ్ అనూహ్యంగా రనౌట్‌కాగా, తర్వాతి ఓవర్ (17వ)లో హుడా కూడా వెనుదిరిగాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 29 పరుగులు జత చేశారు. బ్రాత్‌వైట్ (8) వచ్చి రావడంతోనే లాంగాన్‌లో భారీ సిక్స్ కొట్టినా.. 17.5వ ఓవర్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. క్రీజులోకి వచ్చిన రషీద్ తొలి బంతినే బౌండరీ లైన్ దాటించాడు. కానీ 19వ ఓవర్‌లో మావి తొలి బంతికే యూసుఫ్ వికెట్ తీసి కోల్‌కతాకు ఆనందాన్నిచ్చాడు. అప్పటికి హైదరాబాద్ స్కోరు 138/6. ఈ ఓవర్‌లో డీప్ పాయింట్, డీప్ కవర్స్‌లో రెండు సిక్సర్లు కొట్టిన రషీద్.. కృష్ణ వేసిన చివరి ఓవర్‌లో రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లు బాదేశాడు. ఎనిమిదో వికెట్‌కు భువనేశ్వర్ (5 నాటౌట్)తో కలిసి అజేయంగా 11 బంతుల్లో 36 పరుగులు జోడించి హైదరాబాద్‌కు భారీ స్కోరు అందించాడు.

Celebrities praises Rashid Khan for performance in IPL matches

అవార్డు అందుకున్న రషీద్ తన గొప్ప మనుసును చాటుకుని తమ దేశం (అఫ్గనిస్తాన్)లోని జలాలాబాద్‌లోని ఒక స్టేడియంలో కొద్ది రోజుల జరిగిన బాంబు పేలుళ్ల ఘటన బాధితులకు ఈ అవార్డును అంకితం చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన హైదరాబాద్ జట్టు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో తలపడనుంది. రషీద్ ఖాన్ ఆల్‌రౌండర్ ప్రదర్శనపై సచిన్ సహా క్రీడా, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. రసెల్స్‌ను ఫీల్డింగ్ ఉచ్చులో బిగించి రషీద్ ఔట్ చేసిన కాసేపట్లోనే క్రికెట్ గాడ్ సచిన్ స్పందించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ స్పిన్నర్ నువ్వంటూ ఈ అప్ఘాన్ ఆటగాడిపై ప్రశంసలు గుప్పించాడు. అతడి బ్యాటింగ్ నైపుణ్యాలను కూడా ప్రస్తావించిన సచిన్.. గొప్ప ఆటగాడంటూ ట్వీట్ చేశాడు. ఆఫ్ఘ‌నిస్తాన్ దేశ అధ్య‌క్షుడు ర‌షీద్ ఖాన్ మా హీరో అంటూ అత‌డిని ఆకాశానికి ఎత్త‌గా, టాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా ర‌షీద్ ఖాన్ ఆల్‌రౌండ‌ర్ ప‌ర్‌ఫార్మెన్స్‌ని మెచ్చుకున్నారు.