భారత్‌ సునాయాస గెలుపు
Spread the love

ఆసియా కప్‌లో టీమిండియాకు మరో ఏకపక్ష విజయం. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌ తరహాలోనే ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సాగిన సూపర్‌–4 పోరులో బంగ్లాదేశ్‌ను భారత్‌ చిత్తు చేసింది. ముందుగా బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఆపై ఆడుతూ పాడుతూ సునాయాసంగా లక్ష్యం చేరింది. 14 నెలల తర్వాత తొలి వన్డే ఆడినా సుడులు తిరిగే బంతులతో బంగ్లా కీలక బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. అటు పేసర్లు భువనేశ్వర్‌, బుమ్రా కూడా తమ వాడిని చూపించి ఆ జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేయగలిగారు. ఆ తర్వాత భారత జట్టు లక్ష్య ఛేదనను ఆడుతూ పాడుతూ అధిగమించింది. కెప్టెన్‌ రో‘హిట్‌’ ధనాధన్‌ బ్యాటింగ్‌తో విరుచుకుపడగా ధవన్‌, ధోనీ నిలకడను ప్రదర్శించారు. దీంతో భారత్‌ సూపర్‌ ఫోర్‌ను గెలుపుతో ఆరంభించింది

ఆసియాకప్‌లో భారత్‌ జైత్రయాత్ర సాగుతోంది. సమష్టి ఆటతీరును కనబరుస్తూ శుక్రవారం జరిగిన సూపర్‌ ఫోర్‌ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో నెగ్గింది. టోర్నీలో భారత్‌కిది హ్యాట్రిక్‌ విజయం కావడం విశేషం. ముందుగా బంగ్లాదేశ్‌ జట్టు స్పిన్నర్‌ జడేజా (4/29), భువనేశ్వర్‌ (3/32), బుమ్రా (3/37)ల ధాటికి 49.1 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో మెహదీ హసన్‌ (42) మోర్తజా (26)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జత చేయడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 36.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి నెగ్గింది. రోహిత్‌ (104 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 నాటౌట్‌) అజేయ అర్ధ సెంచరీ చేయగా ధవన్‌ (40), ధోనీ (33) ఆకట్టుకున్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జడేజా నిలిచాడు.

మాయ చేసిన జడ్డూ:

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగే హైలైట్‌. ఏడాది విరామం తర్వాత వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగిన అతడు తన స్పిన్‌ మాయాజాలంతో బంగ్లా పతనాన్ని శాసించాడు. జడేజాతో పాటు పేసర్లు భువనేశ్వర్‌, బుమ్రా కూడా విజృంభించారు.టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆరు ఓవర్లకే బంగ్లా ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. లిటన్‌ (7)ను భువి.. నజ్ముల్‌ (7)ను బుమ్రా ఔట్‌ చేశారు. 16 పరుగులకే వీళ్లిద్దరు వెనుదిరిగారు. ఆ తర్వాత జడేజా హవా మొదలైంది. రాకరాక వచ్చిన అవకాశాన్ని అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లా మిడిల్‌ ఆర్డర్‌ వెన్నువిరిచాడు. అనుభవజ్ఞులైన షకిబ్‌ (17), ముష్ఫికర్‌ రహీమ్‌ (21)తో పాటు మహ్మద్‌ మిథున్‌ (9)నూ వెనక్కి పంపాడు. 18 ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లా 65/5కు చేరుకుంది. కాసేపు నిలిచిన మహ్మదుల్లా (25; 51 బంతుల్లో 3×4)) జట్టు స్కోరును 100 (33వ ఓవర్లో) దాటించాడు. కానీ పరుగులు కష్టంగా వచ్చాయి. మహ్మదుల్లా, మొసాదెక్‌ హుస్సేన్‌ (12)ను భువి, జడేజా వరుస ఓవర్లలో ఔట్‌ చేయడంతో బంగ్లా 101/7కు పడిపోయింది.