ఏబీసీలో సైనా నెహ్వాల్‌ జోరు
Spread the love

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆశలు సగమయ్యాయి. క్వార్టర్స్‌ చేరిన నలుగురిలో ఇద్దరు మాత్రమే ముందడుగు వేశారు. అద్భుత ఫామ్‌లో ఉన్న స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ అన్‌సీడెడ్‌ క్రీడాకారిణిని అలవోకగా ఓడించి.. పురుషుల విభాగంలో హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ రెండో సీడ్‌ సాన్‌ వోన్‌ హో (కొరియా)కు షాకిచ్చి సెమీస్‌ చేరారు. టాప్‌సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌కు మహిళల విభాగంలో మూడో సీడ్‌ పి.వి. సింధుకు ఓటమి తప్పలేదు. శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో సైనా 21-15, 21-13తో లీ జాంగ్‌ మి (కొరియా)ని అలవోకగా ఓడించింది. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ సింధు 19-21, 10-21తో ఏడో సీడ్‌ సుంగ్‌ జి హుయాన్‌ (కొరియా) చేతిలో పరాజయంపాలైంది. మ్యాచ్‌లో తొలి గేమ్‌ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. ఐతే 19-19 స్కోరు సమంగా ఉన్నప్పుడు తడబడిన సింధు వరుసగా పాయింట్లు కోల్పోయి ప్రత్యర్థికి గేమ్‌ సమర్పించుకుంది. రెండో గేమ్‌లో సింధు పూర్తిగా విఫలమైంది. పురుషుల విభాగంలో శ్రీకాంత్‌ 12-21, 15-21తో లీ చాంగ్‌ వీ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. రెండు గేమ్‌ల్లోనూ అతడు నిరాశపరిచాడు. లీ చేతిలో శ్రీకాంత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. కామన్వెల్త్‌ క్రీడల వ్యక్తిగత విభాగం ఫైనల్లోనూ శ్రీకాంత్‌ ఓడిన సంగతి తెలిసిందే. మరోవైపు హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ అసాధారణ ప్రదర్శన చేశాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌లో ప్రణయ్‌ 18-21, 23-21, 21-12తో రెండో సీడ్‌ సాన్‌ వాన్‌ హోపై విజయంసాధించాడు. శనివారం జరిగే సెమీస్‌లో ప్రణయ్‌ మూడో సీడ్‌ చెన్‌ లాంగ్‌ను ఢీకొననుండగా.. సైనా టాప్‌సీడ్‌ తైజు యింగ్‌ (తైపీ)తో తలపడనుంది.

ఇక కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సైనా ఈ టోర్నీలో స్వర్ణం గెలిస్తే ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో  మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి ఎవరూ టైటిల్‌ సాధించలేదు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సైనా, సింధు, శ్రీకాంత్‌:

దిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత అగ్రశ్రేణి షట్లర్లు  సింధు, సైనా, శ్రీకాంత్‌ అర్హత సాధించారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ జులై 30 నుంచి చైనాలో జరగనుంది. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు రజతం, సైనా కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌, సాయి ప్రణీత్‌ కూడా పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌,సుమిత్‌ రెడ్డి- మను అత్రి జోడీలు బరిలో దిగనున్నాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని- సిక్కిరెడ్డి, పూర్విశ- మేఘన.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని- సాత్విక్‌, సిక్కిరెడ్డి- ప్రణవ్‌ జంటలు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నాయి. ఏప్రిల్‌ 26 ర్యాంకులు ఆధారంగా ఆటగాళ్లు లేదా జోడీల అర్హత నిర్ణయిస్తారు. రెండో దశలో ఎవరు ఎంపికవుతారన్నది మే 17న ప్రకటిస్తారు.