Spread the love

ఒక ఊళ్ళో ఒక వెంగళప్ప. ఊళ్ళో చదివి రెండు సంవత్సరాలు సప్లిమెంటరి లో పాస్ అయ్యాడు , ఇహ లాభం లేదని బాగా చదువుకుందామని సిటీ కి వచ్చాడు. ఒక మంచి కాలేజి చూసి అందులో ఫైనలియర్ లో చేరాడు.

ఒక ఎనిమిది నెలల తర్వాత, అనుకోకుండా ఒక అమ్మాయిని చూసాడు. అంతే, ఆమెను చూడగానే వెంగళానికి గుండెలో గంట మోగింది. ప్రేమ అనే ఫీవర్ పట్టేసింది. ఆమె పేరు రాధ. రోజూ రాధ ని చూస్తూ ఆమెని ఫాలో అవుతూ ఉన్నాడు. వారం రోజులు చూసి చూసి, రాధ తన ఫ్రెండ్ తో అన్నది కదా .. “ఛీ ఛీ కుక్కలా ఎలా వెంటపడుతున్నాడో చూడవే ” అని, అది విని బాధపడి, ఇంక దూరం నుంచి చూస్తూ ఉన్నాడు, మళ్లీ ఇలా వారం గడిచింది. అప్పుడు మళ్లీ రాధ, “ఛీ వెధవ చూడటం మానేసాడు” అంది.

అది విని ఇంక ధైర్యం చేసి, రాధని లంచ్ కి పిలిచాడు. సరే, రోజూ ఇదే లంచ్ బాక్స్ కన్నా, ఒకరోజు వాడితో వెళ్లి లంచ్ చేస్తే పోలా! అనుకుని, సరే అంది రాధ. మన వెంగళం బాగా సంబరపడి, బాగా తయారయ్యి వచ్చాడు. రాధకి బిర్యానీ ఇంకా ఏవేవో సూపులూ, స్టార్టర్ లూ కావాలంటే, ఆర్డర్ చేసాడు. రాధని చూస్తూ, ఇంక ఆగలేక, ఐ లవ్యూ రాధా… అని చెప్పేసాడు. ఆ మాట విని రాధ, “బాబోయ్,, ఇప్పుడు నో అంటే బిల్లు కట్టకుండా వెళ్ళిపోతాడేమో?, అసలే చిల్లి గవ్వ తేలేదు ఈ వెధవని నమ్మి, తప్పదు ఇంక…”, అనుకుని నవ్వి, సిగ్గుపడి, అంతా తినేసి వెళ్ళిపోయింది.

వెంగళానికి చెవిలో పాట మోగింది.. గాల్లో తేలినట్టుంది అని. ఆ తెల్లవారి కాలేజిలో, రాధ ని చూసి వెళ్లి హత్తుకోబోయాడు, అంతే, కాలేజి అంతా మోగేలా, చెంప పగులగొట్టి, నిన్న బిల్లు కట్టలేక నవ్వాను, నీ వెధవ మొహానికి నేనా అని తిట్టి, వెళ్ళిపోయింది రాధ. పాపం, మన వెంగాళానికి చాలా బాధ కలిగి, పది రోజులు రాలేదు కాలేజికి. ఈలోగా తనని చూసేవాళ్ళు ఎవరు లేరని, పాపం వెంగళం మంచోడు అనుకుని, అతని కోసం ఎదురు చూడగా, ఒకరోజు వచ్చాడు కాలేజికి. రాధ డైరెక్ట్ గా చెప్పలేక, “నువ్వంటే ఇష్టం..” అని రాసి, ఆ పేపరుని, వెంగళం బుక్ లో పెట్టింది. ఏ రెస్పాన్స్ లేదు. తరువాత రోజు అలాగే పెట్టింది. ఏ రెస్పాన్స్ లేదు. మూడో రోజు, నాలుగో రోజు ఇలా రోజు పెట్టింది. అయినా నో రెస్పాన్స్. ఇంక ఫైనల్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు.

వెంగళం ఇంటికి వెళ్తున్నాడని తెలిసి, అతని బుక్ లో ఇలా రాసి పెట్టింది.. “నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు, ఐ లవ్యూ… ” అని. నో ఆన్సర్. పదిరోజులు గడిచాయి. వెంగళం వచ్చాడు, ఆ రోజు తనకోసం ఎదురు చూసింది రాధ, ఆమెని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. రాధ ఇంక చేసేదేమీ లేక, ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయి బాగానే ఉన్నాడనిపించి సరే అంది. నెల రోజుల్లో రాధ పెళ్ళి.

ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి పదింటికి… వెంగళం బుక్ ఓపెన్ చేసాడు. చూడగానే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు, ఎందుకంటే, ఇన్ని రోజులు అసలు మన వెంగళం బుక్ తెరిస్తేగా.. అన్ని ప్రేమ లేఖలు రాధ రాసిందని, ఆనందంలో, బుక్కు పక్కనెట్టి, లెటర్స్ తో ఊగిపోయాడు… మళ్ళీ మొదలైంది వెంగళానికి, “ఏమైంది ఈ వేళా… ” అని.

పరీక్ష లో ఏమి రాయలేదు, చివరి ఎగ్జామ్ రోజు, రాధని కలిసి, “రాధా.. ఐ టూ లవ్యూ..!” అన్నాడు. ఈసారి రాధ కొట్టిన చెంపదెబ్బ ఊరంతా మోగింది. “వెధవ, అన్ని రోజులు అడిగినా రెస్పాన్స్ లేదు, ఇప్పుడు పది రోజుల్లో నా పెళ్లి, కావాలంటే పెళ్ళికొచ్చి లంచ్ చేసి వెళ్ళు, నేను ఎవరి అప్పు ఉంచుకోను, ” అని వెంగళానికి మంగళం పాడి వెళ్ళిపోయింది.

అప్పుడు తెల్సుకున్నాడు వెంగళప్ప, “జీవితంలో అప్పుడప్పుడైనా పుస్తకం తెరవాలి” అని.

ఒక ఊళ్ళో ఒక వెంగళప్ప. ఊళ్ళో చదివి రెండు సంవత్సరాలు సప్లిమెంటరి లో పాస్ అయ్యాడు , ఇహ లాభం లేదని బాగా చదువుకుందామని సిటీ…

Posted by Telugu Mitrulam on Thursday, 1 May 2014

Leave a Reply