చిక్కులో పడిన పేస్ బుక్
Spread the love

డేటా దుర్వినియోగం కుంభకోణంతో సతమతమవుతోన్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరోసారి చిక్కుల్లో పడింది. ఫేస్‌బుక్‌ డేటా సురక్షితమేనా? అన్న అయోమయంలో ఉన్న యూజర్లకు బగ్‌ రూపంలో మరో ఆందోళన మొదలైంది. ఫేస్‌బుక్‌  సాఫ్ట్ వేర్ లో  ఇటీవల ఏర్పడిన ఓ బగ్‌ కారణంగా కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత పోస్టులు వాటంతట అవే పబ్లిక్‌గా మారాయట. స్వయంగా ఫేస్‌బుక్‌ ఈ బగ్‌ గురించి వెల్లడించింది. దీంతో ఫేస్‌బుక్‌పై యూజర్లలో మరోసారి ఆందోళన రేకెత్తుతోంది.

ఇటీవల తమ సాఫ్ట్ వేర్  లో ఓ బగ్‌ను గుర్తించామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఈ బగ్‌ యూజర్ల వ్యక్తిగత సెట్టింగ్స్‌ను మార్చేసిందని, ‘ప్రయివేటు’, ‘ఫ్రెండ్స్‌ ఓన్లీ’ అని పెట్టుకున్న పోస్టులు వాటంతట అవే పబ్లిక్‌గా మారాయని పేర్కొంది. మే నెలలో కొద్ది రోజుల పాటు ఈ బగ్‌ 1.4కోట్ల మంది యూజర్లపై ప్రభావం చూపిందని తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ బగ్‌ను గుర్తించి, సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది.

మే 18 నుంచి మే 27 వరకు ఈ బగ్‌ ఆక్టివ్‌లో ఉన్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. అయితే అంతకుముందు పెట్టిన పోస్టులకు ఎలాంటి ప్రమాదం లేదని, ఎప్పుడైతే బగ్‌ ఆక్టివ్‌లో ఉందో.. అప్పుడు మాత్రమే పోస్టులన్నీ పబ్లిక్‌ ఆప్షన్‌లోకి వెళ్లిపోయినట్లు పేర్కొంది. యూజర్లు తమ ప్రొఫైల్‌లో ‘ఫీచర్‌ ఐటమ్స్‌’ను షేర్‌ చేసుకోవడం కోసం ఇటీవల ఫేస్‌బుక్‌లో కొత్త పద్ధతిని తీసుకొచ్చామని, అప్పుడే ఈ పొరబాటు జరిగినట్లు వెల్లడించింది. దీని వల్ల ప్రయివేటుగా పెట్టిన పోస్టులన్నీ ఆటోమేటిక్‌గా పబ్లిక్‌ ఆప్షన్‌లోకి వచ్చినట్లు చెప్పింది. బగ్‌ ద్వారా ప్రభావితమైన యూజర్లకు నోటిఫికేషన్‌ పంపిస్తున్నట్లు తెలిపింది. యూజర్లు తమ పోస్టులను ఒకసారి పరిశీలించుకోవాలని సూచించింది.

ఇటీవల ఫేస్‌బుక్‌ డేటా దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి 8.7కోట్ల మంది యూజర్ల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా అంగీకరించారు. తమ వల్ల పొరబాటు జరిగిందని బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు.

Leave a Reply