క్యాస్టింగ్‌ కౌచ్
Spread the love

తారల తళుకుబెళుకులన్నీ

తామరాకుపై నీటి బొట్టులే…

మనీ జ్వాలల్లో

దిక్కూదివాణం లేని బతుకులే..

శీతాకాలపు వాళ్ళ ఉదయాలను..

వర్షాకాలపు సాయంత్రాలను..

ఎండాకాలం మధ్యాహ్నాల్ని…

ఆధిపత్యపు పోరు నుంచి

అరువడిగి ఆస్వాదించాల్సిందే..

రంగుల ప్రపంచపు మూల్యాంకనంలో

అన్నీ ఎర్ర గీతల హాహాకారాలే..

మనస్సుని తాకట్టు పెట్టి..

వయసుకు వాటాలేసి..

అంతరాత్మను ఏటిఎంలా వాడుకునే వాళ్లే…

విలాసాల దాహానికి

నిన్ను శకలాలను చేసి..

నీదొక నిస్సిగ్గు బతుకంటూ..

నీవొక నిర్లజ్జ సరుకువంటూ…

మాటల తూటాలతో

గేలి చేసి వారు..

గాలి వార్తల గోడలు కట్టి…

బతికున్న శవాన్ని జేసి

సమాధి కట్టేస్తారు… !

ఐదారడుగుల నీ దేహానికి

రెండు అర ముక్కలు తగిలించి

వికృత నవ్వులతికించి…

దొంగ కెమేరా కళ్ల కరవాలాల

ప్రశ్నలకు…

నలిగిన దుప్పట్ల మడతల్లోంచి

కాగితప్పూల నవ్వులే సమాధానాలే కదా..!

దిండు గుండెల్లో

వెచ్చగా జారి ఆరిన

కన్నీటి చారికలే గుర్తులే కదా…!

నీ చూపుడు వేలు అడిగే

ఒక్క ఛాన్స్‌ విలువ

కొన్ని పక్కలపై నీ దేహం

గీసిన రంగుల చుక్కల ముగ్గే కదా…!

అవను

నీ నీడ పై నీ కన్నీటి పై..

క్యాట్‌ వాక్‌ చేసే నీచుల పీచమణచడానికి..

నువ్వు అణుజ్వాలవై నిత్యం రగలాలి…

అర్ధాంతరంగా ఖాళీ ఐన నీ ఉనికిని..

ఆక్టోపస్సులా అనుక్షణం విస్తరించాలి..

కరెన్సీ కోరలకు కకావికలమైన నీ శకలాలను ఏరి

నీకై, నీవై..,

గట్టి గవాక్షం కట్టుకోవాలి..

పైకి అందంగా నవ్వే విషపుష్పాలను

పుక్కిట పట్టి, మొండి వీపులపై..

రౌద్రతాండవం చేసి

శూన్యంలోకి విసిరేయాలి..

క్యాస్టింగ్‌ కౌచ్‌ కేటుగాళ్ల చూపుల ప్రశ్నపత్రాన్ని

నీ చెప్పుల నిప్పుల కింద కాల్చి తగలెయ్యాలి…!”