టికిట్‌ తమకే కావాలంటూ పట్టుబడుతున్న కూటమి నేతలు
Spread the love

మహాకూటమిలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం నాడు కూడా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. స్క్రీనింగ్‌ కమిటీలో ఖరారు కాని 15 స్థానాలకు చెందిన అభ్యర్థులను ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో  కాంగ్రెస్‌ అధిష్టానం బుజ్జగింపులు మొదలెట్టింది.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉండటంతో ఎవ్వరికి టికెట్‌ వచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పారు. అయితే ఒక వేళ ఒక అభ్యర్థికి టికెట్‌ ఖరారైతే మరొక అభ్యర్థికి చెందిన కార్యకర్తలు, శ్రేణులు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేద్దామంటూ అభ్యర్థిపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమచారం. మహా కూటమిపై ఈ నెల 9న అధికారికంగా విడుదల కానున్న నేపథ్యంలో ఎవ్వరికి టికెట్‌ వరిస్తుందో ఉత్కంఠ భరితంగా అటు అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గంలోని మహా కూటమి అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు టికెట్ల కోసం అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి, నల్ల మడుగు సురేందర్‌లు టికెట్‌ను ఆశించిన వారిలో ఉన్నారు. కాబట్టి గత నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి పాలైన నల్లమడుగు సురేందర్‌కు నియోజకవర్గంలో సానుభూతి ఉండటంతో తనకే టికెట్‌ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహాకూటమి సీట్ల సర్దుబాటు, సీపీఐ, తెజసకు కేటాయించే స్థానాలపై చర్చించేందుకు తెజస అధ్యక్షుడు కోదండరాం ముఖ్ధూం భవన్‌కు వెళ్లారు. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, జాతీయ నేత నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో ఆయన సమావేశమై పలు అంశాలపైన చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీ తెజసకు కేటాయించే స్థానాలపై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 14 స్థానాల ఇవ్వాలని తెజస కోరుతుండగా 9 సీట్లకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్‌ తేల్చి చెప్పింది. ఇచ్చే 9 స్థానాల్లోను తెజస కోరేసీట్లు కేవలం 5 మాత్రమే ఉన్నాయని.. రెండు కోరనివి, ఏమాత్రం బలంలేని మరో రెండు స్థానాలను ఇస్తామని చెప్పడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అంతేకాకుండా తెజసకు కేటాయించిన కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ స్నేహాపూర్వక పోటీ చేస్తుందని చెప్పడంతో తెజస వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలతోనే కోదండరాం సీపీఐ నేతలను కలిసి ఈ అంశాలన్నింటిపైనా చర్చించినట్లు తెలుస్తోంది.