జనసేన లో మాజీ  ముఖ్య మంత్రి కొడుకు?
Spread the love

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆఖరి స్పీకర్‌ గా పని చేసిన నాదెండ్ల మనోహర్‌ రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన మళ్లీ వర్థమాన రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన మనోహర్, దీని తర్వాత ఈ రోజు పవన్ కల్యాణ్‌ తో ప్రత్యేకంగా సమావేశమవడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పటమటలంకలోని పవన్ కల్యాణ్‌ కొత్త నివాస గృహంలో  దాదాపు వీరిద్దరూ అరగంట పాటు ఏకాంతంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలతో పాటు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై నాదెండ్ల మనోహర్‌, పవన్ కల్యాణ్‌ లు  చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

నాదెండ్ల మనోహర్‌ పవన్ కల్యాణ్ ను కలవడంపై రెండు భిన్నమైన అభిప్రాయాలు వినపడుతున్నాయి.  రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రెస్ లేకుండా పోయిన కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ పునర్వైభవం తెచ్చేందుకు  రాహుల్‌గాంధీ ప్రయత్నిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే, రఘువీరారెడ్డి స్థానంలో   నాదెండ్ల మనోహర్‌కు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారని, ఆయన సూచన మేరకే పవన్ కల్యాణ్ ను నాదెండ్ల మనోహర్ కలిశారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో, ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే బాగుంటుందన్న ఆలోచనను రాహుల్‌గాంధీ చేస్తున్నారని.. రాష్ట్రంలో కీలక శక్తి ‘జనసేన’ ను తమ అధ్యక్షుడు గుర్తించారని.. ఈ క్రమంలోనే ఈ సమావేశం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆఫ్‌ ది రికార్డ్‌ వ్యాఖ్యానిస్తున్నారు.

మరో వైపు, నిన్న నంబూరులో నాగార్జున యూనివర్శిటీ దగ్గర  నిర్వహించిన శ్రీ భూసమేత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్ర ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా.. జనసేనానిని నాదెండ్ల మనోహర్ కలిశారు. దశావతార విగ్రహం స్థాపన కార్యక్రమం సందర్భంగా పవన్ కల్యాణ్‌.. మనోహర్‌లు శుక్రవారం కలుసుకున్నారని.. శని, ఆదివారాలు పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తన నివాసానికి ఎవరినీ రావద్దని నాయకులకు, కార్యకర్తలకు సూచించిన పవన్ కల్యాణ్‌ ఈ రోజు ఇంత హఠాత్తుగా నాదెండ్ల మనో్హర్‌ తో సమావేశమవడం తమను కూడా ఆశ్చర్యపరిచిందని జనసేన వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే, నాదెండ్ల మనోహర్‌ జనసేన తీర్థం పుచ్చుకుంటారేమోనన్న సందేహాలను ఈ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.