
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎంల కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి మాయావతి గారు విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ఏపీకి యువ ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పారు. గురువారం సాయంత్రం తిరుపతి వేదికగా జరిగిన బహుజన జనసేన యుధ్దభేరి సభలో శ్రీ పవన్‌కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. సభకు హాజరైన ఆశేష జనప్రవాహాన్ని ఉద్దేశించి మాయావతి గారు మాట్లాడుతూ.. “యూపీని నాలుగు దఫాల్లో మేం ఎలా అయితే అభివృద్దిపరిచామో అదే స్థాయిలో శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారన్న నమ్మకం ఉంది. నిబద్దతతో పని చేసే ఆయన ప్రజల అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారన్న భరోసా ఉంది.
హోదా పేరిట బీజేపీ-టీడీపీలు ప్రజల్ని మోసం చేశాయి
బీఎస్పీ, జనసేన, వామపక్షాల కూటమిని చంద్రబాబుతో కలిపి మాట్లాడుతున్నారు. బీఎస్పీ, జనసేన, సిపిఐ, సిపిఎం మినహా మా కూటమికి మరే ఇతర పార్టీతో సంబంధం లేదు. ప్రత్యేక హోదా పేరు చెప్పి బీజేపీ-టీడీపీలు ఆంధ్ర ప్రజల్ని మోసం చేశాయి. ఏపీలో విపక్ష పార్టీ అదే బీజేపీకి కొమ్ము కాస్తోంది. దళిత, బలహీన వర్గాలకు జనసేన కూటమి మాత్రమే న్యాయం చేయగలదు. మా కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కి సెంట్రల్ సర్వీసెస్‌లో కోటా పెంచుతాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్దిలో ఏపీకి సముచిత స్థానం కల్పిస్తాం. చిత్తూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్ధులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఐదేళ్ల క్రితం ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో ఒక్కటీ నెరవేర్చలేదు. ఇప్పుడు మరో వాగ్దాన పత్రం బీజేపీ సిద్ధం చేసింది. ఆ మేనిఫెస్టోలతో మీ ముందుకు వచ్చే పార్టీలను ప్రశ్నించండి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏంటని. బీఎస్పీ ఎప్పుడూ మేనిఫెస్టోలు విడుదల చేయలేదు. కేవలం ప్రజలకు ఏం కావాలో అది మాత్రమే చేశాం. గత ఎన్నికల్లో అనేక మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేయలేకపోయింది. చౌకీదార్ అంటూ వాళ్ళు ఆడుతున్న నాటకాలు ఇక సాగవు. ఇప్పుడు మోడీ చేస్తున్న దొంగ ప్రమాణాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడ్డారు. దేశ ప్రజల్ని మోసం చేస్తూ, మభ్యపెడుతున్న మోడీకి ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారు. ఆర్.ఎస్.ఎస్ ముసుగులో దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఆర్.ఎస్.ఎస్. అజెండాను అమలుచేస్తున్నారు. దేశభక్తి అనే అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీ తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్-బీజేపీల పాలన దేశాభివృద్దిని వెనక్కి నెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిరే రైతులు, దళితులు, మైనారిటీల సమస్యల్ని నిర్లక్ష్యం చేసింది. ప్రయివేటు ఉద్యోగాల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలను మోసం చేసిన బీజేపీని ఈసారి దేశ ప్రజలు తిరస్కరిస్తారు. కాంగ్రెస్,బీజేపీ ప్రజలు విశ్వాసం కోల్పోయాయి. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి వీల్లేదు. బీజేపీకి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. మా కూటమితోనే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహనీయులు పూలే, నారాయణగురు, అంబేద్కర్, శ్రీ కాన్షీరాం గార్లు కన్న కలలను సాకారం చేస్తామ”ని హామీ ఇచ్చారు.
తిరుమల పవిత్రత కాపాడుతాం
శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మాట్లాడుతూ…”తిరుమల ఏడు కొండలస్వామి పవిత్రత కాపాడేందుకు ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉండే అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేస్తాం. రౌడీలు, గూండాలు ఇక్కడ ఎలా రాజ్యం ఏలుతారో చూస్తాం. తిరుమలవాసుల ప్రతి సమస్యను తీరుస్తాం. స్విమ్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ది చేస్తాం. తిరుపతిలోని 52 స్లమ్స్‌ని కలిపి మిని తిరుపతి నగరంగా తీర్చిదిద్దుతాం. మోడల్ సిటీగా మారుస్తాం. అతి పెద్ద జీవకోనను తిరుపతికి తగ్గకుండా అభివృద్ధి చేస్తాం. యువతకు ఆటస్థలాలు, పార్కులు, ఇళ్లులేని వారికి ఇళ్ల స్థలాలు ఇలా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తాం. తలకోనను ఎకో టూరిజం స్పాట్‌గా మలచి మరింత ప్రాచుర్యం కల్పిస్తాం. టమాటా తదితర పంటలు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ ఉంచేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తాం. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నుంచి 18 నెలల్లో మంచినీటి సమస్య తీరుస్తాం. మూతపడిన కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం. హెరిటేజ్ అభివృద్ది కోసం మూతపెట్టిన విజయ డెయిరీ తెరిపించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. విజయ డైరీ కోసం 16 ఏళ్లుగా చెప్పులు లేకుండా తిరుగుతున్న పెద్దాయన త్యాగానికి ఇది ఫలితంగా ఉండాలి. తిరుమలలో ఉద్యోగుల ఇబ్బందుల నుంచి వంటలు చేసే స్వాముల వరకు అందరి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతాం. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది.
సోదరి మాయావతి గారు ప్రధానిగా తిరిగి తిరుపతిలో అడుగుపెట్టాలి. మాయావతి గారు ఎన్నో కష్టాలుపడి వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కి, రాజకీయాలకు వేల కోట్లు అవసరం లేదు. జగన్మోహన్రెడ్డి గారి మాదిరి గూండాలతో పనిలేదు. తనపై నమ్మకంతో వచ్చిన సైన్యం సాయంతో నాలుగుసార్లు అతిపెద్ద రాష్ట్రం యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు. చాయ్‌వాలా మోడీ కాస్తా ఇప్పుడు చౌకీదార్ అయిపోయారు. ఈ చౌకీదార్ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాకుండా చేశారు. మోడీ గారికి తీసుకోవడమేగాని ఇవ్వడం అలవాటు లేదు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారు.బీజేపీ కన్వినెంట్ పాలిటిక్స్ చేస్తోంది. నన్ను వెంకటగిరిలో సభ పెట్టనీయకుండా చేసింది. వారికి అండగా ఉన్న వైసీపీకి, చేతగాని టీడీపీకి చెప్పండి.. ఇది 2009 కాదు 2019 అని. ఇలాంటి వ్యవస్థలను పక్కన పెట్టాలి. వారి పల్లకీలు మోసి మోసి అలసిపోయాం. మనం వారి పల్లకీలు మోస్తే వారు మనల్ని వదిలేస్తున్నారు. ఇది మారాలి కాన్షీరాం గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు , మాయావతి గారి అడుగు జాడల్లో నడిచి సరికొత్త భారతావనిని నిర్మిద్దాం. ఇదే తిరుపతిలో స్పెషల్ స్టేటస్ ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తానని ఏడుకొండల వాడి సాక్షిగా ఇచ్చిన హామీని గాలికి వదిలేస్తే, తెలుగు రాష్ట్రాలకు నేను అండగా ఉంటానని ముందుకు వచ్చిన మాతృమూర్తి మాయావతి గారికి పాదాభివందదనాలు. తిరుపతి వైసీపీ అభ్యర్ధి కరుణాకర్‌రెడ్డి పైకి అంతా సమానం అంటారు. అన్ని చట్టాలు పాటిస్తాం అని చెబుతారు. ఎయిర్‌పోర్టులో అధికారుల చొక్కాలు పట్టుకుంటారు. దాడులు చేస్తారు. వారికి ఎదురు ఎవరైనా పోటీ చేస్తే ఇబ్బందులకు గురి చేస్తారు. యూపీలో వీధి వీధికి ఉన్న ఇలాంటి వ్యక్తులను చీల్చి చెండాడిన రుద్రకాళి సోదరి మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తితో కరుణాకర్‌రెడ్డిని ఎదుర్కోవాలంటే ప్రతి వీర మహిళా మాయావతి గారిలా మారాలి.
సోదరి మాయావతి గారు ప్రేమతో అలయెన్స్‌కి అంగీకరిస్తే దాన్ని సందేహిస్తున్నారు. మీరు మనుషులకే విలువ ఇవ్వరు. దళితులు ఏం విలువ ఇస్తారు. కడపలో కొన్ని గ్రామాల్లో ఈ రోజుకీ నాయకుల ఇళ్ల మధ్య నుంచి చెప్పులు చేత్తో పట్టుకుని తిరిగాల్సిన పరిస్థితులు ఉన్నాయి . వీరు దళితుల్ని ఉద్దరిస్తారా. తిరుపతి ఎంపిగా బరిలోకి బీఎస్పీ అభ్యర్ధిని నిలబెట్టాం. వారిని గెలిపించకపోతే దళితుల పట్ల ఏ మాత్రం గౌరవం ఇవ్వని, గుర్తింపు లేని వైసీపీ ముందుకు వెళ్తుంది. 2009లో కోట్లాది మంది అభిమానించే వ్యక్తి సామాజిక మార్పు ధ్యేయంగా పీఆర్పీ పెట్టారు. బలమైన మార్పు వస్తుందనుకున్నారు. ఏ పార్టీ ఇవ్వని విధంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి సీట్లు ఇచ్చారు. ఇప్పుడు చూస్తే వైసీపీ నేతలు ఎవరూ ఎదగకుండా రాజకీయాలు చేస్తున్నారు. ఎంత కాలం వీరి పల్లకీలు మోస్తాం. జగన్, కరుణాకర్‌రెడ్డి లాంటి వారి పల్లకీలు మోసి మోసి భుజాలు అరిగిపోయాయి. వాళ్లు పాలించే వారు మనం పాలింపబడేవాళ్లమా.? చిరంజీవి గారి లాంటి వ్యక్తినే ఆపేసిన విధానం ఏ రోజున మరచిపోను. వీళ్ల గూండాగిరిని తట్టుకునేందుకు చదలవాడ కృష్ణమూర్తి గారిని బరిలో నిలిపా. ఆయనకు మనం అండగా నిలబడకపోతే సుగుణమ్మ గారి అల్లుడి రౌడీయిజం, కిరాణా షాపుల్ని సైతం బతకనివ్వని మామూళ్ల వసూళ్లు, కరుణాకర్‌రెడ్డి గూండాయిజాన్ని నిలువరించడం ఎలా.? టీడీపీ చైర్మన్‌గా పనిచేసి వెంకన్నకే విలువ ఇవ్వని వ్యక్తి, ఏడుకొండలవాడి నగలు ఎన్ని పోయాయో ఆయనకే తెలియదు. తిరుపతి నుంచి చెబుతున్నా టీడీపీ నాయకులు గానీ, వైసీపీ నాయకులు గానీ జనసైనికుల జోలికి వస్తే తాట తీసి కూర్చోబెడతా. మీరు పాలించే వారు మేం బానిసలుగా బతికే వారిమా.? మాకు ఆవేశం ఉంది. కోపం ఉంది. అయితే మీలా రోడ్ల మీదికి వచ్చి గొడవలు చేయం. కాన్షీరాం గారిలా.. ఓటు అనే ఆయుధంతో బలమైన మార్పు తీసుకువస్తాం. వారు కత్తులు పట్టుకుని వస్తున్నారు. మన దగ్గర అవి లేవు. మనం ప్రజాస్వామ్యవాదులం, ఓటు అనే ఆయుధంతో ముందుకు వెళ్దాం.
ఇలాంటి పరిస్థితులు మారాలి అంటే రౌడీ మూకల తాట తీసిన సోదరి మాయావతి గారి స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. నేను కాన్షీరాం గారికి, మాయావతి గారికి ఏకలవ్య శిష్యుడిని. వినోద్‌రాయల్ అనే అభిమాని హత్య బాధించింది. ఆ తల్లిని పలుకరించడానికి వచ్చినప్పుడు యువతలో ఇంత గొడవలు ఉన్నాయన్న విషయం తెలిసింది. నాడు మోడీ గారు ఇదే తిరుపతిలో ఇలాంటి సభలో కూర్చుని పవన్‌కళ్యాణ్ దేశభక్తుడు , ఏమీ ఆశించడు అంటూ పొగిడారు. పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. చట్టసభల్లో ఇచ్చిన మాటకు సైతం విలువ లేదు. టీడీపీ ధర్మపోరాట దీక్షలంటూ ఊగిపోవడం మినహా సాధించింది ఏమీ లేదు. గడచిన మూడేళ్లుగా హోదాపై గొంతెత్తిన ఏకైక పార్టీ జనసేన మాత్రమే. మనం మాట్లాడిన 48 గంటల్లో ప్యాకేజీ అనే పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారు. వ్యతిరేకిస్తే తిట్టిపోశారు. బీజేపీ సర్కారు ఆంధ్రులకు చేసిన అన్యాయాన్ని, ద్రోహాన్ని నేను మరచిపోలేదు. మాయావతి గారు మాత్రం అడగకుండానే స్టేటస్ ఇస్తామని చెప్పారు. చంద్రబాబు గారిలా 36 సార్లు నాలుక అటు ఇటు తిప్పే వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌ని గాలికి వదిలేసిన బీజేపీ, పది సార్లు మభ్యపెట్టిన చంద్రబాబు, ఏపీకి స్టేటస్‌ని వ్యతిరేకించే కేసీఆర్‌తో చేతులు కలిపిన జగన్మోహన్రెడ్డి ఇక్కడ ఉన్నారు. వీరందరి మధ్య మాయావతి గారు ఓ ఒయాసీస్లా కనబడ్డారు జనసేన పార్టీ, బీఎస్పీ, వామపక్ష పార్టీల కూటమి అభ్యర్ధులను గెలిపించండి” అంటూ పిలుపునిచ్చారు. అనంతరం చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి జనసేన కూటమి తరుపున బరిలోకి దిగుతున్న ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్ధులను సభకు పరిచయం చేశారు.