రాజ్యసభ  డిప్యూటీ చైర్మన్ కావడానికి కేశవా రావు  ఆరాటం
Spread the love

రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్ పదవిని కేకేకు ఇవ్వాలంటూ ప్రధాని మోడీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగినట్లుగా చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా మోడీతో సమావేశమైన కేసీఆర్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ కోరికను మోడీ మన్నించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకూ రాజ్యసభలో టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు పలువురు ఉన్నా.. కేకేను మాత్రమే కేసీఆర్ ఎందుకు ప్రతిపాదించినట్లు?అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

దీనికి బలమైన లెక్కలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీలు కాకుండా సభలో ఉన్న సభ్యుల్ని లెక్కేస్తే 241 మంది ఉన్నారు. డిఫ్యూటీ ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే బీజేపీ కూటమికి 122 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి ఉన్న సభ్యులు కేవలం 87 మాత్రమే. అంటే.. అవసరమైన మెజార్టీకి చాలా దూరంగా ఉన్నట్లే. ఇప్పుడున్న పరిస్థితుల్లో 35 మంది మద్దతు కూడగట్టుకోవటం బీజేపీకి సాధ్యమయ్యే పని కాదు. ఇదిలా ఉంటే.. యూపీఏకు 58 మంది సభ్యులు ఉన్నారు. అంటే.. ఈ కూటమి కూడా సొంతంగా డిప్యూటీ ఛైర్మన్ పోస్ట్ ను సొంతం చేసుకునే అవకాశం లేదు.

ఇలాంటివేళ.. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తున్న కేసీఆర్ పార్టీ కంటే కూడా రాజ్యసభలో ఎక్కువ మంది సభ్యులున్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ కేసీఆర్ తమకు అవకాశం ఇవ్వాలన్న రాయబారాన్ని నడుపుతున్నారు. ఎందుకంటే.. బీజేపీకి ప్రస్తుతం మిత్రులు లేని నేపథ్యంలో.. తాజా ప్రతిపాదనను ఓకే అంటే టీఆర్ ఎస్ రూపంలో బీజేపీకి కొత్త మిత్రుడు తెర మీదకు వచ్చినట్లు అవుతుంది.

అదే సమయంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాల్ని నడిపేందుకు సిద్ధమన్న అధినేత.. మోడీకి మిత్రుడిగా అవతరిస్తారు. ఇక.. సాంకేతికంగా ఉన్న లెక్కల్ని చూసుకుంటే.. రాజ్యసభలో ఎక్కువ మంది నేతలు ఉన్నప్రాంతీయపార్టీల విషయానికి వస్తే.. అన్నాడీఎంకేకు 13 మంది.. తృణమూల్ కాంగ్రెస్ కు 13 మంది.. సమాజ్ వాదీ పార్టీకి 13 మంది ఉన్నారు.

బీజేపీ కానీ ఓకే అంటే.. కేసీఆర్ తనకున్న వ్యక్తిగత పరిచయాలతో సమాజ్ వాదీ పార్టీని.. తృణమూల్ ను ఒప్పించే వీలుంది. ఇక.. అన్నాడీఎంకే చేత ఓకే అనిపించటానికి కమలనాథులు ఉండనే ఉన్నారు. ఇప్పటికే లోక్ సభ డిప్యూటీ స్పీకర్ బాధ్యతల్ని అప్పగించిన నేపథ్యంలో.. మరో పదవిని అడిగేందుకు అన్నాడీఎంకే సంకోచించటం ఖాయం. ఇలాంటి వేళ.. మిత్రుడు మోడీ చెప్పినట్లుగా చేసే వీలుంది.దీంతో ఆరుగురు సభ్యులున్న టీఆర్ ఎస్ కు జాతీయ పార్టీ బీజేపీ.. ప్రాంతీయ పార్టీలు కలిసి మద్దతు ఇస్తే.. తమ పార్టీకి చెందిన నేత రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్ గా అవతరించే వీలుంటుంది.

తన ప్రతిపాదనకు తృణమూల్ పోటీ వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. తృణమూల్ నేతలతో కేకేకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. సర్దుబాటు చేసే వీలుందని చెబుతున్నారు. మోడీ బలంతో తమ పార్టీ నేత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్  కావటాన్ని మమత ఎంతవరకు సమర్థిస్తారన్న దానిపై అనుమానాలులేకపోలేదు. ఈ నేపథ్యంలో డిఫ్యూటీ ఛైర్మన్ పదవికి కేకే సరైన అభ్యర్థిగా కేసీఆర్ భావించి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభలో టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుగురు ఎంపీల్లో కేకే సీనియర్ కావటంతో పాటు.. గతంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వ్యవహరించిన వైనం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పదవికి కేకే సూట్ అవుతారన్న లెక్కలతోనే కేసీఆర్ రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు.