మంగళగిరిలో జనసేన  అభ్యర్థిని నిలబెట్టకపోవడానికి కారణం ?
Spread the love

ఏపీ ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జనసేన బరిలో దిగుతోంది. బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కేటాయించిన పవన్.. సీపీఐ, సీపీఎంలకు తలో ఏడు అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాల చొప్పున కేటాయించారు. మిగతా స్థానాల్లో జనసేన బరిలో దిగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నప్పటికీ.. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళరి స్థానాన్ని సీపీఐకి కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. లోకేష్‌పై తన పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపొద్దనే ఉద్దేశంతో పవన్ ప్యాకేజీ తీసుకొని ఆ స్థానాన్ని సీపీఐకి ఇచ్చారని వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. వివిధ వర్గాల్లోనూ ఈ విషయమై చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించారని ఆ నియోజకవర్గ చరిత్రను బట్టి చెప్పొచ్చు. 1952 నుంచి మంగళగిరి నుంచి గెలుపొందిన పార్టీలను పరిశీలిస్తే.. నాలుగుసార్లు కమ్యూనిస్టులు, ఆరుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు టీడీపీ, ఒకసారి జనతాపార్టీ గెలిచాయి. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది.