మనస్ఫూర్తిగా… నిత్యం ప్రజలకు సేవ చేయడమే జనసేన చెప్పే థ్యాంక్స్ – శ్రీ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గారు..
Spread the love

మనస్ఫూర్తిగానిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు మన పార్టీ  చెప్పే నిజమైన కృతజ్ఞత అవుతుంది అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని చెప్పారు. రాజ‌కీయాల్లో మార్పు మొద‌లైంది… ఈ ప్ర‌కియను ఇలాగే కొన‌సాగిద్దాం అని  పిలుపునిచ్చారు. ఆదివారం మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగిన యువ అభ్య‌ర్ధుల‌తో ముఖాముఖి స‌మావేశం అయ్యారు. పోలింగ్ సంద‌ర్బంగా అభ్య‌ర్ధుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “ఎన్నిక‌లు పూర్త‌యిన వెంట‌నే వైసీపీ మాకు 120స్థానాలు వ‌స్తాయంటే, టీడీపీ మాకు ఇన్ని స్థానాలు వ‌స్తాయంటూ లెక్క‌లు వేయ‌డం మొద‌లుపెట్టాయి, మ‌నం మాత్రం అలా లెక్క‌లు వేయం. ఓటింగ్ స‌ర‌ళి ఎలా జ‌రిగిందో తెలుసుకోమ‌ని మాత్ర‌మే పార్టీ నాయ‌కుల‌కు చెప్పా. మార్పు చిన్న‌గానే మొద‌ల‌వుతుంది. ఇది మ‌నం ఎదిగే దశ. ఈ మార్పు ఎంత వ‌ర‌కు వెళ్తుందో తెలియ‌దు. నేను మిమ్మ‌ల్ని గుర్తించిన విధంగానే మీరు గ్రామ స్థాయి నుంచి నాయ‌కుల్ని  గుర్తించండి. నాయ‌కుల్ని త‌యారుచేయండి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఇదే మార్పును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్దాం. తెలంగాణ‌లో కూడా ఇదే త‌ర‌హా మార్పును ప్ర‌జ‌లు ఆహ్వానిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్య‌మైన విష‌యం మీకు అండ‌గా నిల‌బ‌డిన వారికి, మ‌ద్ద‌తు తెలిపిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డం మాత్రం మ‌రిచిపోవ‌ద్దు. ప్ర‌తి గ్రామానికి ఓ రోజు కేటాయించి అంద‌ర్నీ క‌ల‌వండి. స్థానిక సమ‌స్య‌ల్ని గుర్తించి వాటి మీద బలంగా మాట్లాడండి. వాటి పరిష్కారం కోసం పని చేస్తూ వారికి సేవ చేయడమే నిజమైన కృతజ్ఞత. స‌మ‌స్య పెద్దది అయితే నేను స్పందిస్తాను. నియోజ‌క‌వ‌ర్గాలవారీగా పార్టీ కార్యాల‌యాలు కొన‌సాగించండి. ఆఫీస్ అంటే పెద్ద పెద్ద హంగులు, ఆర్భాటాలు అవ‌స‌రం లేదు. కార్య‌క‌ర్త‌లు కూర్చోవ‌డానికి వీలుగా ఓ రూమ్‌, ప్రెస్ మీట్ పెట్ట‌డానికి ప్లేస్ ఉంటే చాలు. గ్రామ స్థాయిలో స‌మ‌స్య‌ల మీద ఓ ప‌ట్టిక త‌యారు చేసి రెడీగా పెట్టుకోండి.

కొత్తగా పోటీ చేశారు కాబ‌ట్టి మీ అనుభ‌వం తెలుసుకుందామ‌న్న ఉద్దేశంతోనే ఈ ముఖాముఖి ఏర్పాటు చేశాం. భ‌యం, అభ‌ద్ర‌తా భావాన్ని దాటుకుని వచ్చిన యువశక్తి ఇది. ఈ మార్పును ముందుకు తీసుకువెళ్దాం. 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్  స్థాపించిన‌ప్పుడే ఓట‌మి భ‌యం లేని కొత్త త‌రాన్ని, పోరాటం చేయ‌గ‌లిగిన వారిని రాజ‌కీయాల్లోకి తీసుకురావాలి అనుకున్నా. అంతా స‌మాజాన్ని మార్చాల‌నుకుంటారు. కానీ ముంద‌డుగు వేసే వారు త‌క్కువ‌. ముందుకు వెళ్దామంటే స్నేహితులు, సొంత వారే మ‌ద్ద‌తు ఇవ్వ‌రు. ఇలాంటి ప‌రిస్థితుల్ని అధిగ‌మించి ఓ ముంద‌డుగు వేశాం. నిధులు, నియామ‌కాల వ్య‌వ‌హారంలో తేడా వ‌చ్చిన‌ప్పుడే ఉద్య‌మాలు పుడ‌తాయి. తెలంగాణ ఉద్య‌మం కూడా అలా పుట్టిందే. ప్ర‌తి చోటా రెండు కుటుంబాలే అంతా ఆప‌రేట్ చేస్తూ వ‌స్తున్నాయి. ఎవ‌రికి నిధులు వెళ్లాలి, నీరు ఎవ‌రికి వెళ్లాలి అనే విష‌యం కూడా వారే ఆప‌రేట్ చేస్తున్నారు. అదే అంశం మీద ఫైట్ చేద్దామ‌నిపించింది. మార్పు రావాలంటే ముందు భ‌య‌ప‌డ‌కూడ‌దు. అలాంటి మార్పు యువ‌త‌తోనే సాధ్యం అన్న న‌మ్మ‌కంతో ముందుకు వెళ్లాను అని అన్నారు.

జనసేన పార్టీ ముఖ్య‌నేత  శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్ గారు మాట్లాడుతూ.. “ఇది ఓ ఎన్నిక‌ల కోసం మొద‌లు పెట్టిన ప్ర‌యాణం కాదు. నవ తరానికి  అవ‌కాశం ఇవ్వాల‌ని ఉద్దేశంతో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ముంద‌డుగు వేశారు. మీ అనుభ‌వాన్ని తెలుసుకునేందుకు ఈ ముఖాముఖి స‌మావేశం ఏర్పాటు చేశాం. జ‌న‌సేన పోరాటం చేసిన స‌మ‌స్య‌ల మీద మీరు ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన సంద‌ర్బంలో ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చింది.. మీకు ఎదురైన అనుభ‌వాలు ఏంటి అనేది తెలుసుకోవాల‌నుకున్నాం. ఇది ఓ నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం కాదు. తెలంగాణ‌లో సైతం కార్య‌క‌ర్త‌లు జ‌న‌సేన జెండాను అద్భుతంగా మోశారు.  స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కొంత ఇబ్బందిప‌డినా, ఆరోగ్యం సమస్య వచ్చినా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు అభ్య‌ర్ధుల గెలుపు కోసం త‌న‌వంతు కృషి చేశార‌”ని తెలిపారు. ఈ ముఖాముఖి స‌మావేశంలో జ‌న‌సేన త‌రపున బ‌రిలోకి దిగిన యువ అభ్య‌ర్ధులు త్తమ నియోజకవర్గాల్లో ఎదురైన అనుభవాలు, ఎలక్షనీరింగ్ ప్రక్రియలో అనుసరించిన పంథా, జనసేన పార్టీ ఉద్దేశాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళింది తెలియచేశారు.  ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుల రాజకీయ సలహాదారు శ్రీ రామ్మోహనరావు,  పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల కమిటీ క‌న్విన‌ర్ శ్రీ మాదాసు గంగాధ‌రం, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్  పాల్గొన్నారు.