ప౦దా మార్చిన ఐటి అధికారులు
Spread the love

సాధారణంగా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారంటే.. అయితే ఉన్నతాధికారులు.. లేదంటే సినిమా సెలబ్రిటీలు. వీరు మినహా పెద్దగా కనిపించరు. పెద్ద పెద్ద వ్యాపారస్తుల మీద దాడులు నిర్వహించినా.. అదంతా చాలా తక్కువ సందర్భాల్లో తప్పించి రెగ్యులర్ కాదు

ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీకి చెందిన పాతిక మంది ఫ్యాషన్ డిజైనర్ల ఇళ్ల మీదా.. వారి షోరూంల మీద ఆదాయపన్ను అధికారులు దాడులు నిర్వహించటం షాకింగ్ గా మారింది. ఇన్ని రంగాలు ఉన్నా.. ఎప్పుడూ ఆదాయపన్ను శాఖాధికారులు దాడులు చేసినట్లుగా దాఖలాలు లేని ఫ్యాషన్ డిజైనర్ల మీద ఐటీ శాఖ టార్గెట్ చేయటం సంచలనంగా మారింది.

ఈ దాడులు కొన్ని గంటల పాటు సాగినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున అనుమానిత లావాదేవీల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ.. ఖాన్ మార్కెట్.. మహిపాల్ పూర్.. గ్రేటర్ కైలాష్ ప్రాంతాల్లోని కొన్ని షోరూంల మీద దాడులు నిర్వహించారు.

పలువురు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల షోరూంలతో పాటు ఉత్తర ఢిల్లీలోని సింగర్ నరేంద్ర చాంచల్ ఇంట్లోనూ ఐటీ అధికారులు పన్ను ఎగువేతకు సంబంధించిన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఆయన ఇంటితో పాటు.. ఆయన పూర్వీకుల ఇళ్ల మీద దాడులు జరిపారు. ఈ సందర్భంగా రూ.215 కోట్లు విలువైన నల్లధనాన్ని గుర్తించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఫ్యాషన్ డిజైనర్లతో పాటు.. ఢిల్లీలోని దిగ్గజ కేటరింగ్.. టెంట్ ఆపరేటర్ల మీద కూడా ఐటీ దాడులు నిర్వహించటం సంచలనంగా మారింది. పన్ను ఎగవేతకు.. నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉండని పలు రంగాలకు చెందిన వారిపై తనిఖీలు నిర్వహించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.