రాఫెల్‌ వివాదం.. తెరపైకి ‘ఫ్రెంచ్‌  అధ్యక్షుడి  భార్య’ !!
Spread the love

ఫ్రాన్స్‌తో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసుకున్న రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై గత రెండేళ్లకు పైగా సాగుతున్న వివాదంలో ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్‌ హొలాండే ఆజ్యం పోశారు. భారత భాగస్వామ్య కంపెనీగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేయడంలో తమ ప్రమేయం లేదని, ఆ కంపెనీ పేరును భారత ప్రభుత్వమే సూచించిందని హొలాండ్‌ శుక్రవారం బాంబు పేల్చిన విషయం తెల్సిందే. యుద్ధ విమానాల ఒప్పందం ప్రకారం భారత్‌లోని 72 కంపెనీల్లో ఏ కంపెనీనైనా భాగస్వామి కంపెనీగా ఎంపిక చేసుకొనే అవకాశం డసాల్ట్‌ కంపెనీకి ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం సూచించిన రిలయెన్స్‌ డిఫెన్స్‌ కంపెనీని ఎంపిక చేసుకోక తప్పలేదని కూడా ఆయన వివరించారు.

రిలయెన్స్‌ కంపెనీ ఎంపికలో తమ ప్రమేయం లేదని, భారత్‌లో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలన్నది రాఫెల్‌ యుద్ధ విమానాలను తయారు చేసే డసాల్ట్‌ కంపెనీ ఇష్టమని, ఈ మేరకు ఒప్పందంలో కూడా వెసులుబాటుందని భారత ప్రభుత్వ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలను ఖండిస్తూ వస్తోన్న కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వారం అంటే వారం క్రితమే మళ్లీ ఇదే పాట పాడారు. ‘రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో డసాల్ట్‌ కంపెనీ భారత దేశ భాగస్వామ్య కంపెనీ ఏదో కూడా నాకు తెలియదు. దానికంటూ ఓ ప్రత్యేకమైన నిబంధనావళి ఉంటుంది. సామర్థ్యం కలిగిన కంపెనీల్లో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలన్నది డసాల్ట్‌ కంపెనీ ఇష్టం. నేను ఈ విషయంలో ఫలానా కంపెనీని ఎంపిక చేయాల్సిందిగా సూచించలేను. ఆమోదించలేను. అలా అని తిరస్కరించనూ లేను’ అంటూ సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ అత్యంత గమనార్హం. హొలాండ్‌ శుక్రవారం వెల్లడించిన ఈ తాజా అంశాలపై ఇటు నిర్మలా సీతారామన్‌గానీ అటు ప్రధాని కార్యాలయంగానీ స్పందించలేదు. ‘ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాత్రం ముక్తిసరిగా స్పందించారు. హొలాండ్‌ వ్యాఖ్యలను గుడ్డిగా ఖండించడం కుదరదు. ఎందుకంటే ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా ఈ యుద్ధ విమానాల ఒప్పందం చేసుకున్నారు.

ఫ్రెంచ్‌ మాజీ అధ్యక్షుడు హొలాండే జీవిత భాగస్వామియే కాకుండా నిర్మాత కూడా అయిన అందాల తార ఫ్రెంచి నటి జూలి గయెత్‌తో అంబానీ గ్రూప్‌ ‘రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌‌’ ఫ్రెంచ్‌లో ఓ సినిమా తీసేందుకు చర్చలు జరిపింది. 2016, జనవరి 24వ తేదీన ఈ మేరకు జూలి గయెత్‌కు చెందిన ‘రోగ్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థతో రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆ తర్వాత రెండు రోజులకే అంటే, 2016, జనవరి 26వ తేదీన భారత్‌తో రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై హొలాండే సంతకం చేశారు. ఇప్పుడు ఈ అంశం ఫ్రెంచ్‌ రాజకీయాలను వేడిక్కించింది. జూలి గయెత్‌తో సినిమా ఒప్పందం కుదుర్చుకున్నందునే రిలయెన్స్‌ డిఫెన్స్‌ కంపెనీని హొలాండ్‌ ఎంపిక చేశారంటూ ఫ్రెంచ్‌ మీడియాలో దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే రిలయెన్స్‌ డిఫెన్స్‌ కంపెనీని భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందనే విషయాన్ని ఆయన వెల్లడించాల్సి వచ్చింది. ఈ రాఫెల్‌ యుద్ధ విమానాలకు సంబంధించి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు భారత భాగస్వామ్య కంపెనీగా ప్రభుత్వరంగ సంస్థ ‘హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌’ను సూచించింది. మోదీ అధికారంలోకి వచ్చాక సీన్‌ పూర్తిగా మారింది. 28వేల కోట్ల రూపాయల ఒప్పందం కాస్త 51 వేల కోట్ల రూపాయలకు చేరింది. 2017, అక్టోబర్‌ నెలలో యుద్ధ విమానాల ప్రాజెక్ట్‌ను సంయక్తంగా చేపడుతున్నామని డసాల్ట్, రిలయెన్స్‌ కంపెనీలు సంయుక్త ప్రకటన చేశాయి. అదే నెలలో నాగపూర్‌లో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఫ్రెంచ్‌ రక్షణ మంత్రి ఫోరెన్సీ పార్లీలు పాల్గొన్నారు. అయినా రిలయెన్స్‌ వ్యవహారం మన నిర్మలా సీతారామన్‌కు తెలియదట. ఆమెను పిలవనందుకు అలిగి అలా చెబుతున్నారని అనుకోవాలా!!