కాంగ్రెస్‌ గూటిలో చేరిన మాజీ సీఎం ……….
Spread the love

గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ జై సమైఖ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా  కప్పుకున్నారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ చీఫ్‌ రఘువీరాతో కలసి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం పార్టీలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరడం వల్ల పార్టీకి కొంత లాభం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కిరణ్‌తో పాటు విభజన సమయంలో కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలలో చేరిన నేతలందరినీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలనే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ ఆదేశాల మేరకు ఏపీ కాంగ్రెస్‌ నేతలు కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీలోకి తీసుకువచ్చే విషయంలో కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు కీలకంగా వ్యవహరించారు. కొద్దిరోజుల క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డితో పల్లంరాజు సమావేశమై రాహుల్ ఆలోచనలు తెలియజేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే ఖచ్చితంగా పార్టీలోకి వస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆ మేరకు ఈ రోజు రాహుల్ సమక్షంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ కండువగా కప్పుకుని పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్‌ తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి సేవలు పార్టీకి అవసరమని నేతలు భావిస్తున్నారు. అందుకే సీనియర్‌ నేతలు పలు విడతలుగా ఆయనతో భేటీ అయి పార్టీలో చేరాలని కోరారు. సుదీర్ఘ మంతనాల అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ను వీడి సొంత‌ పార్టీ పెట్టుకున్న వైఎస్‌ జగనే తమ టార్గెట్‌ అని చెబుతున్న నేతలు.. కిరణ్‌ చేరికతో ఆ దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విభజన తర్వాత కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ అంతా వైకాపా వైపు వెళ్లడంతో దాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని యోచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కనీసం 15శాతం ఓటుబ్యాంకు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నేతలు చెబుతున్నారు