మార్పు మొదలైంది.. ఓటమి, ఫలితం అనే భయాలు లేవు: పవన్
Spread the love

ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మార్పు మొదలైందని, అది అసెంబ్లీలో కనబడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్అన్నారు. మార్పు ఎంత ఏంటి అనే సంగతి పక్కనబెడితే.. జనసేప పార్టీ బలాన్ని మాత్రం తక్కువగా అంచనా వేయొద్దని అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేన బలం తెలియదు అన్న పదం ఎవరూ మాట్లాడవద్దని, కొన్ని లక్షల మంది యువత వెంట ఉన్నారని పవన్ అన్నారు. మీడియా, మందీ మార్బలం లేకుండా ఇంతమంది ఎన్ని కోట్లు ఇస్తే వస్తారని జనసైనికులను ఉద్దేశించి అన్నారు. ఈ మేరకు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు.

అభ్యర్థులను ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘పీఆర్పీ సమయంలో అంతా ఆశతో వచ్చారు, ఆశయంతో ఎవరూ రాలేదు. జనసేన పార్టీ మాత్రం ఆశయాలతో ముందుకు వెళ్తుంది. నాకు ఓటమి భయం లేదు, ఫలితం ఎలా ఉంటుందనే భయం లేదు. ఎన్ని సీట్లు వస్తాయి అన్న అంశం మీద దృష్టి పెట్టలేదు. ఎంత పోరాటం చేశామన్న అంశం మీదే నా ఆలోచన. మార్పు కోసం మహిళలు చాలా బలంగా నిలబడ్డారు. గెలుస్తారా..? లేదా..? అన్న అంశం పక్కనపెట్టి భయపడకుండా వచ్చి ఓట్లు వేశారు’ అని అన్నారు.

రాజకీయ ప్రయాణంలో సహనం, ఓపిక అవసరమని, గుండె ధైర్యం కావాలని అభ్యర్థులకు పవన్ సూచించారు. ‘అంతా కన్వెన్షనల్ పాలిటిక్స్‌ చేస్తున్నారు. నేను మాత్రం అలాంటి రాజకీయాలు చేయను. డబ్బు ఇచ్చి ఓట్లు కొనాలి అంటే ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. నేను ఓటమి లోతుల నుంచి బయటకు వచ్చాను. నాకు నిగ్రహం-నియమం ఉన్నాయి. ఎన్నో అవమానాలు, వెటకారాలు భరించాను. 2014లో జనసేన పార్టీ స్థాపించే సమయంలో ఎన్ని సీట్లు వస్తాయి అన్న ఆలోచన చేయలేదు. ఎక్కడో ఒక చోట మార్పు రావాలి అని మాత్రమే ఆలోచించాను. చాలా మంది సీటు గెలిచి మీకు గిఫ్టుగా ఇస్తామంటున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి పదాలకు తావులేదు’ అని అభ్యర్థులనుద్దేశించి పవన్ అన్నారు.

అంతా పార్టీ నిర్మాణం జరగాలి అని సలహాలు ఇస్తున్నారని, కానీ అది అంత తేలిక ప్రక్రియ కాదని పవన్ స్పష్టం చేశారు. ‘అన్ని పార్టీల్లా కూర్చుని వీరికి సెక్రటరీ, వారికి అది అని పదవులు ఇవ్వడం కాదు పార్టీ నిర్మాణం అంటే. కొత్తతరాన్ని తయారు చేస్తున్నాం. అంతా ఓ భావజాలనికి అలవాటు పడాలి. నన్ను అర్థం చేసుకునే వారు కావాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. జనసేన పార్టీ స్టాపించినప్పుడు లీడర్స్‌ లేరు. జనసైనికులు మాత్రమే ఉన్నారు. అదే జనసైనికులు కొన్ని లక్షల మంది యువత రూపంలో మీ వెంట ఉన్నారు. అంతా కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువత. వారికి పవన్‌ కళ్యాణ్‌ తప్ప ఎవరూ తెలియదు. ఎవరి మాట వినరు. ఇదంతా ముడి సరుకు. దాన్ని శుద్ధి చేయాలి, సానబట్టాలి. అందుకు నిబద్దత అవసరం’ అని పవన్ దిశానిర్దేశం చేశారు.

పార్లమెంటరీ కమిటీలు కూర్చుని వేస్తే రెండు రోజుల్లో ముగించేయొచ్చని.. కానీ, రెండు వారాలు రాత్రి, పగలు కష్టపడితే గాని పూర్తి కాలేదని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ‘పోరాటం చేస్తారు అన్న నమ్మకంతోనే సీటు ఇచ్చాం. ఇబ్బందులు ఎదురైనప్పుడు డిఫెన్స్‌ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రతికూల పరిస్థితుల్లోనే వ్యక్తిత్వం బయటకు వస్తుంది. ఎవరి మనసులో అయినా మోసం చేయాలన్న భావన వస్తే అది నన్ను మోసం చేసినట్టు కాదు. మీకు మీరే చేసుకున్నట్టు. ఎన్ని సీట్లు గెలిదామన్న దానికంటే, ఎంత శాతం ఓటింగ్‌ వచ్చింది అన్నది, ఎంత మందిని మార్పు దిశగా కదిలించామన్నదే ముఖ్యం. ముందుగా ఓట్లు వేసిన వేలాది మందిని గౌరవించండి. ఎంత బాగా పోరాడాం అన్న అంశం మీద ఆలోచన చేయండి. స్థానిక సమస్యల మీద, స్థానిక ఎన్నికల మీద దృష్టి పెట్టండి. మార్పు మొదలైంది. అది మన గెలుపు. మార్పు అన్నది గొప్ప అంశం, ఎమ్మెల్యే అన్నది చిన్న అంశం అని గుర్తుపెట్టుకోండి’ అని స్ఫూర్తినిచ్చే విధంగా పవన్ చెప్పారు.