జ‌న‌సేన పార్టీ అంటేనే ధైర్యం… పోరాటం చేయ‌డం
Spread the love

జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి ఆశ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసేలా జ‌న‌ సైనికులు కృషి చేయాల‌ని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మ‌న్ శ్రీ మాదాసు గంగాధరం తెలిపారు.

రాష్ట్రంలో మార్పు మొద‌లైందని, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యువ‌త‌, మ‌హిళ‌లు, వృద్ధులు జ‌న‌సేన పార్టీకి అండ‌గా నిల‌బ‌డ్డార‌ని తెలిపారు. ఆదివారం విజ‌య‌న‌గ‌రంలోని శుభం ఫంక్ష‌న్ హాల్ లో విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట‌రీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. జనసేన ముఖ్యనేతలు హాజరై పోలింగ్ సంద‌ర్భంగా అభ్య‌ర్థుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ మాదాసు గంగాధరం మాట్లాడుతూ  “నా రాజ‌కీయ జీవితంలో చాలా మంది నాయ‌కుల‌తో ప‌నిచేశాను. చాలామంది నాయ‌కుల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయి. కానీ శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి లాంటి నిబ‌ద్ధ‌త క‌లిగిన నాయ‌కుడిని ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు. ప్ర‌జాసేవ కోసం జీవితాన్ని అంకితం చేయాల‌ని విలాస‌వంత‌మైన జీవితాన్ని తృణ‌ప్రాయంగా వ‌దులుకున్నారు. తెలంగాణ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ గారికి భ‌య‌ప‌డి అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌లేని ప‌రిస్థితుల్లో జ‌న‌సేన మాత్ర‌మే ధైర్యంగా అభ్య‌ర్థుల‌ను పోటీకి నిల‌బెట్టింది. కొన్ని వ‌ర్గాలు, కొన్ని కుటుంబాల‌కే ప‌రిమిత‌మైన రాజ్యాధికారాన్ని, వెనక‌బ‌డిన వర్గాల‌కు అందించాల‌నే ఉద్దేశంతో బీఎస్పీ పార్టీ తో క‌లిసి దేశ రాజ‌కీయాల్లో అడుగుపెడుతున్నాం. జ‌న‌సేన పార్టీ కొన్ని జిల్లాల్లో బ‌ల‌హీనంగా ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. అది అబ‌ద్ధం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు మ‌న మ‌న‌సులో ఉంటే బ‌ల‌హీనం అనే ప్ర‌స‌క్తే లేదు. ఆయ‌నే మ‌న బ‌లం. ఏ పార్టీలోనైనా విభేదాలు స‌ర్వ‌సాధార‌ణం. జ‌న‌సైనికులు మ‌న‌స్ప‌ర్ధ‌లను ప‌క్క‌న‌పెట్టి క‌లసిక‌ట్టుగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ విజ‌యానికి కృషి చేయాల‌”ని కోరారు.

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి  రాజకీయ సలహాదారు శ్రీ పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ “మ‌హాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావ‌డానికి పోరాటం చేస్తే.. జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్యం తీసుకురావ‌డానికి పోరాటం చేస్తున్నారు. మిగ‌తా పార్టీల్లా కులాల‌ను విడ‌దీసే రాజ‌కీయం జ‌న‌సేన పార్టీ చేయ‌దు. కులాల‌ను క‌లిపే రాజ‌కీయం మాత్ర‌మే చేస్తుంది. ప్ర‌జా స‌మ‌స్య‌లను పరిష్కారం దిశగా ముందుకు తీసుకువెళ్లే స‌త్తా ఉన్న ఏకైక పార్టీ జ‌న‌సేన పార్టీయే. ప్ర‌త్యేక హోదాపై పోరాడి దానిని ఇంకా బ‌తికి ఉంచేలా చేసింది. తెలంగాణ‌లో 20 మంది ఇంట‌ర్ విద్యార్ధులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డితే విద్యార్ధుల త‌రఫున పోరాటం చేసింది. గ్రామ‌ స్థాయిలో రాజ‌కీయాధికారం రావాలంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లే ముఖ్యం. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో బూత్ ఏజెంట్లుగా ప‌నిచేయ‌డానికి చాలా మంది యువ‌కులు భ‌య‌ప‌డ్డారు. ఆ భ‌యాన్ని పోగొట్టాలంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెల‌వాలి. యువ‌కులు గుర్తుంచుకోవాల్సింది జ‌న‌సేన పార్టీ అంటేనే.. ధైర్యం, పోరాటం చేయ‌డం. సంస్థానాలు, ఆస్థానాల బురుజులను బద్ధలు కొట్ట‌డానికే జ‌న‌సేన పార్టీ పుట్టింది. ఏ పార్టీ కూడా జ‌న‌ సైనికుల‌ను ఏమీ చేయ‌లేవు.  ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయ స్వాతంత్ర్యం రావాలంటే రాజ‌కీయ ప‌ద‌వుల్లో ఉండాలి. విజ‌య‌న‌గ‌రం లోక్ స‌భ ప‌రిధిలో 690 పంచాయితీలు, 5733 వార్డులు, 3 మున్సిపాలిటీలు, 25 జెడ్పీటీసీ, 406 ఎంపీటీసీలు ఉన్నాయి. అన్ని ప‌ద‌వుల‌కు జ‌న‌ సైనికుల‌ను సిద్ధం చేసేలా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తున్నాం. ప్ర‌తి గ్రామంలో వార్డు క‌మిటీలు వేస్తాం. గ్రామాల‌ను వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే దిశ‌గా కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తాం. ప‌ద‌వి లేక‌పోతే పోరాటం చేయ‌లేం, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించలేం. అందుకే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలిచే విధంగా జ‌న‌సైనికులు కృషి చేయాలి” అన్నారు.

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి పొలిటిక‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ పి.హ‌రిప్ర‌సాద్ మాట్లాడుతూ “విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయంగా ప్ర‌త్యేక‌మైన జిల్లా. కొన్ని కుటుంబాల చేతుల్లో రాజ‌కీయాలు చిక్కుకుపోయాయి. ఇక్క‌డ నుంచి పోటీ చేసి నెగ్గుకురావ‌డం అంత సామాన్య‌మైన విష‌యం కాదు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యాల్లో, ప‌రిమిత వ‌న‌రుల‌తో జ‌న‌ సైనికులు చేసిన పోరాటం అద్భుతం, అమోఘం. జ‌న‌సేన పార్టీ 100 ఏళ్లు మ‌నుగ‌డ సాగించేలా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు పునాదుల నుంచి నిర్మించుకొస్తున్నారు. పార్టీ మ‌నుగ‌డ‌పై కొంద‌రు వ్య‌క్తం చేస్తున్న అనుమానాలు అర్ధ‌ర‌హితం.  పార్టీ గెలుపుకు యువ‌త‌, మ‌హిళ‌ల‌తో పాటు బ‌య‌ట‌కు రాని వ్య‌క్తులు అజ్ఞాతంగా కృషి చేశారు. శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో రాజ‌కీయ మార్పుకు శ్రీకారం చుట్ట‌బోతున్నాం.  వ్య‌క్తిగ‌త విజ‌యం కంటే పార్టీ విజ‌యం ముఖ్యమ‌ని భావించి జ‌న‌ సైనికులు స‌మష్టిగా ప‌నిచేసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకు మ‌న‌కు మ‌రో మంచి అవ‌కాశం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌ల‌పై ప్ర‌తి జ‌న‌ సైనికుడు దృష్టి సారించి గ్రామ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయాలి. ప్ర‌తి గ్రామంలో జ‌న‌సేన పార్టీ పోటీ చేసి గెలిచే విధంగా కార్య‌చ‌ర‌ణ రూపొందించాలి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ ద్వారా మ‌నం వేసే అడుగు 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముంద‌డుగు కావాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు. ఈ స‌మావేశానికి జ‌న‌సేన పార్టీ నేత శ్రీ టి.శివ శంక‌ర్ అధ్య‌క్ష‌త వ‌హించారు. పార్టీ ముఖ్యులు శ్రీ వై. న‌గేష్ , శ్రీ బొలిశెట్టి స‌త్య పాల్గొన్నారు. స‌మావేశం అనంత‌రం విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట‌రీ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ముఖాముఖీ నిర్వ‌హించారు. జ‌న‌సేన అభ్య‌ర్థి, ఆ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ముఖ్యులు హాజ‌ర‌య్యారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి విడివిడిగా రివ్యూ నిర్వ‌హించారు.