అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది
Spread the love

తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఆయా రాష్ట్రాల్లో వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నాది. ఈ నెల 12న షెడ్యూల్‌ విడుదల కావొచ్చని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసిందని అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. ఐదు రాష్ట్రాల్లో మొత్తం ఐదు దశల్లో పోలింగ్‌ నిర్వహించడానికి వీలుగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ మినహా నాలుగు రాష్ట్రాల్లో ఒక రోజే పోలింగ్‌ జరగనుంది. మొదటి దశ పోలింగ్‌ నవంబర్‌ 11న ప్రారంభమై 30న తుది దశతో పూర్తవుతుంది. ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ డిసెంబర్‌ మొదటి వారంలో ముగియునంది. శాసనసభ రద్దు దరిమిలా ముందస్తు ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో మొదటగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

నవంబర్‌ 11–17 తేదీల మధ్య రెండు దశల్లో తెలంగాణ, మిజోరంలో, నవంబర్‌ 18–24 మధ్య రెండు దశల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో, 25–30 తేదీల మధ్య ఒక దశలో రాజస్తాన్‌లో పోలింగ్‌ జరగనుంది. ‘మేము ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పోలింగ్‌ ఏర్పాట్లను జూన్‌–జూలైలోనే మొదలుపెట్టాం. శాసనసభ రద్దు దరిమిలా తెలంగాణలో సెప్టెంబర్‌ రెండో వారంలో ఆ ప్రక్రియ ప్రారంభించాం. మేము అనుకున్న దానికన్నా వేగంగా ఆ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈవీఎంలతోపాటు అవసరమైన వీవీ ప్యాట్‌లను వంద శాతం సమకూర్చాం. ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై అన్ని స్థాయిల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించే కార్యక్రమం కొనసాగుతోంది’అని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

డిసెంబర్‌ 10కల్లా కొత్త ప్రభుత్వాలు…

నవంబర్‌ ఆఖరుకల్లా పోలింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్‌ మొదటి వారంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. మామూలుగా అయితే డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉండొచ్చని సమాచారం. కాబట్టి రీ పోలింగ్‌ వంటి సమస్యలు లేకపోతేనే ఇది సాధ్యపడుతుంది. ఏదేమైనా డిసెంబర్‌ 10కల్లా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, తెలంగాణ, మిజోరంలో 10వ తేదీ నాటికే ప్రభుత్వం ఏర్పడుతుందని ఈసీ వర్గాలు వెల్లడించాయి.