శివసేన ఎక్కడకి పోలేదు : అమిత్ షా
Spread the love

దేశంలో పరిస్థితులు అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో కమలనాథుల జోరు తగ్గుతోంది. ఉప ఎన్నికల్లో వరుస ఓటములతో కుంగిపోయిన బీజేపీ మెల్లగా కాస్త వెనక్కి తగ్గుతోంది. తన బెట్టు వీడుతోంది. ఇన్నాళ్లూ ఎన్డీఏలోని మిత్రులు పోతే పోనీ అన్నట్లుగా వ్యవహరించిన ఆ పార్టీ మళ్లీ వాళ్ల దగ్గరికి వెళ్లే పనిలో ఉంది. ఇందుకు నిదర్శనం తాజాగా అమిత్షా తీసుకున్న కీలక నిర్ణయమే. తమకు బీజేపీయే అతిపెద్ద శత్రువు అని చెప్పిన శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేను కలిసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిసైడవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో పడేసింది. బుధవారం ముంబైలో వీళ్ల భేటీ జరగనుంది.

2014లో కలిసి పోటీ చేసిన శివసేన అనంతరం ఆ పార్టీకి గుడ్బై చెప్పింది. బీజేపీతో తెగదెంపుల తర్వాత ఆ పార్టీని శివసేన తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన పాల్ ఘర్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి.పాల్ ఘర్ ఉప ఎన్నికల్లో శివసేనపై బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కూడా శివసేన ఆరోపించింది. తమకు రాజకీయాల్లో అతిపెద్ద శత్రువు బీజేపీనే అని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ మధ్యే అన్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా.. ఉద్ధవ్ థాక్రేను కలవడనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అమిత్ షానే ఉద్ధవ్ జీ సమయం కోరారు. బుధవారం సాయంత్రం వీళ్ల సమావేశం ఏర్పాటు చేశాం అని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత తమ నేతను అమిత్ షా కలవడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. అయితే తాజాగా జరిగిన ఉప ఎన్నికలతో దీనికి సంబంధం లేదని దేశవ్యాప్తంగా పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగానే ఉద్ధవ్ను అమిత్ షా కలుస్తున్నారని బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగంతివార్ వెల్లడించారు.

కాగా కొద్దికాలం క్రితం అమిత్ షా శివసేన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు నిండిన నేపథ్యంలో  అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు తప్పుకున్నా.. మా టీమ్ లోకి నితీశ్ వచ్చారని ఆయన అన్నారు. ఎన్డీఏ కుటుంబం పెరిగిందని బాబు నిష్క్రమణతో తమకు ఎటువంటి లోటు లేదని షా తెలిపారు. అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యల ఫలితంగానే తాజాగా ఈ భేటీ జరుగుతోందని అంటున్నారు.

 

Leave a Reply