వైసీపీ ఎంపీలకు స్పీకర్ లేఖ!: రాజీనామాలపై
Spread the love

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలుసమర్పించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు  లోక్‌ సభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది. ఈ మేరకు మే 29వ తేదిన తనను కలవాలని స్పీకర్ సుమిత్రా మహజన్ వైసీపీ ఎంపీలకు లేఖలను పంపారు. రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలతో చర్చించనున్నారు. ఆ రోజున వీరితో స్పీకర్ వ్యక్తిగతంగా మాట్లాడతారని… విడివిడిగా వీరితో సమావేశమై స్పీకర్ వీరి రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్‌ వైఎస్సార్‌ సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారని తెలిపారు. రాజీనామా చేసిన ఎంపీలు అందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామని మిథున్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్‌.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు… రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేసిన విషయం తెలిసిందే.

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల చివరి రోజున వీరు స్పీకర్‌కు రాజీనామా పత్రాలను ఇచ్చారు. ప్రత్యేకహోదా డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని వైసీపీ ఎంపీలు అభిప్రాయంతో ఉన్నారు. తమ రాజీనామాలను ఆమోదించుకొని ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును కోరాలని వైసీపీ భావిస్తోంది. ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడం ద్వారా టిడిపిని రాజకీయంగా ఇరుకున పెట్టాలని వైసీపీ బావిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీల కూటమి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఏపీకి హోదా సాధ్యం కాదని కేంద్రం అంటున్న నేపథ్యంలో అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలు ఆమోదం పొందే అవకాశాలున్నాయని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. సమయం ఇస్తే స్పీకర్‌తో సమావేశం అవుతామని వారు కోరారు.దాంతో స్పీకర్‌ కార్యాలయం వైకాపా ఎంపీలకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 29న సాయంత్రం 5-6 గంటల మధ్య స్పీకర్‌ను కలవాలని ఎంపీలందరికీ ఈ-మెయిల్‌ పంపింది.అందువల్ల ఆ రోజు రాజీనామాల ఆమోదం జరగవచ్చని భావిస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాల నేపథ్యంలో వారితో మాట్లాడి స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.