ఈటల రాజేందర్‌ పై మహిళలు ఆగ్రహం…
Spread the love

కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో గ్రామాల అభివృద్ధిని విస్మరించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌, గూడూరు, నేరెళ్ల, గూనిపర్తి, శ్రీరాములపల్లి, అంబాల గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంబాల గ్రామంలో జరిగిన సభలో మంత్రి ఈటల మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను చేపట్టామన్నారు. ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులకు, యువతకు, రజక, మంగళి, విశ్వబ్రా హ్మణ వంటి కులవృత్తుల వారికి ఫైనాన్సియల్‌ సపోర్టు స్కీంను వచ్చే నెలలో చేపట్టి ఆర్థిక చేయూత అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తల్లి లాంటిదని, అన్ని వర్గాలను అదుకుంటామన్నారు. కమలాపూర్‌ మండలాన్ని జిల్లాలోనే గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

దశాబ్దాలకాలంగా ఎదురు చూసిన కమలాపూర్‌ మండల ప్రజల కల సాకారం కాబోతుందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఉప్పల్‌లో రైల్వేబ్రిడ్జికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ… రూ.175 కోట్ల తో హుజురాబాద్‌ నుంచి కమలాపూర్‌ మీదుగా పరకాలకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టామన్నారు. అందులో భాగంగానే రూ.66 కోట్లతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నామన్నారు. 8నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. బ్రిడ్జి మంజూరు విషయంలో కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ కృషి మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్‌కుమార్‌, మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌, ఎంపీపీ వినోద్‌కుమార్‌, జడ్పీటీసీ నవీన్‌కుమార్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, వైస్‌ ఎంపీపీ దశరథం, సర్పంచ్‌లు శ్రీనివాస్‌, సమ్మయ్య, ఎంపీటీసీలు స్వరూప, సులోచన, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు కుమారస్వామిగౌడ్‌, సాంబారావు, రమేష్, ప్రదీప్‌రెడ్డి, దేవేందర్‌రావు, రాములు, శ్రీనివాస్‌, శేఖర్‌, సంపత్‌, అరవింద్‌, ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మండలంలోని గూడూరు గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసేందుకు మంత్రి ఈటల రాజేందర్‌ విచ్చేశారు. పనులను ప్రారంభిస్తుండగా కొంతమంది మహిళలు తమకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయలేదని, స్థలాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని డ్రైనేజీలు సరిగా లేవని, గ్రామ నాయకులు సమస్యలను సరిగా పట్టించుకోవడం లేదని తెలిపారు. దీంతో పోలీసులు మహిళలను శాంతింపజేసేందుకు యత్నించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మహిళలతో మాట్లాడుతూ అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కట్టిస్తామని తెలపడంతో శాంతించారు.