చిల్లర వ్యాపారం.. చేతినిండా పని!
Spread the love

బీజింగ్‌ : ఓ మహిళా కస్టమర్‌ చేసిన పనికి కార్ల షోరూంలో పనిచేసే సిబ్బంది దిమ్మతిరిగిపోయింది. కారు కొనడానికి పెద్ద మొత్తంలో చిల్లర తేవటంతో వాటిని లెక్కపెట్టడానికి.. సిబ్బంది తల్లో ప్రాణం తోకలోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని కాన్‌జౌవ్‌కు చెందిన ఓ మహిళ తను దాచుకున్న డబ్బుతో ఫోక్స్‌వాగన్‌ కారు కొనాలనుకుంది. ఇందుకోసం తను 10సంత్సరాలుగా దాచుకున్న చిల్లరను 66 ప్లాస్టిక్‌ సంచుల్లో నింపి కార్ల షోరూంకు తీసుకెళ్లింది. ఫోక్స్‌వాగన్‌ కారును ఎంచుకున్న తర్వాత డబ్బు చెల్లించాల్సిన సమయంలో ప్లాస్టిక్‌ సంచుల్ని చూపించింది. దీంతో ఆశ్చర్యపోవటం అక్కడి సిబ్బంది వంతైంది.

సంచుల్ని ఒక్కొక్కటిగా విప్పి చిల్లర లెక్కించటానికి.. 17 మంది సిబ్బంది మూడు రోజులు కష్టపడాల్సి వచ్చింది. చిల్లర లెక్కపెట్టిన వారి చేతులు సైతం నల్లగా మారిపోయాయి. పెద్దపెద్ద పెట్టెలలో వాటిని సర్దిపెట్టి భద్రంగా బ్యాంకుకు తరలించారు. చిల్లర లెక్కిస్తున్న దృశ్యాలను వీడియో తీసిన సిబ్బంది దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి సంఘటనే కొద్ది నెలలక్రితం చైనాలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే..