ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది
Spread the love

ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఢిల్లీలో శుక్రవారం నాడు లీటర్ పెట్రోల్ 12 పైసలు పెరిగి రూ.82.48కి చేరింది. డీజిల్ 28 పైసలు పెరిగి రూ.74.90కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.87.94 (12 పైసలు పెరుగుదల)కి చేరింది. డీజిల్ రూ.78.51 (29 పైసలు పెరుగుదల)కి పెరిగింది. గత వారం పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 పైసలు చొప్పున కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇంతే మొత్తానికి (రూ.2.50 చొప్పున) వ్యాట్ తగ్గించాలని కేంద్ర మంత్రి జైట్లీ విజ్ఞప్తి చేసారు. ఎన్డీఏ పాలిత 13 రాష్ట్రాలతో పాటు గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ వెంటనే తగ్గింపును చేశారు. కాగా, కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ క్రమం తప్పకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో తమ ఇబ్బందులు షరామామూలుగానే ఉన్నాయని వినియోగదారాలు అంటున్నారు.

ఇంధన రేట్లపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత మొదటిసారిగా కేంద్రం ఈ విధమైన ఆదేశాలివ్వడంతో చమురు కంపెనీలకు (ఓఎంసీ) మళ్లీ సబ్సిడీల భారం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.   అక్టోబర్‌ 5న రేట్లను తగ్గించినప్పటికీ.. ఆ తర్వాత ఇంధన రేటు మళ్లీ పెరుగుతూ పోవడంతో కేంద్రం మరోసారి ఓఎంసీలను ధర తగ్గించమని సూచించవచ్చనే వార్తలొచ్చాయి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వీటిపై వివరణనిచ్చాయి. దాంతో గురువారం నాడు ఆయిల్‌ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇంట్రాడేలో హెచ్‌పీసీఎల్‌ 19 శాతం, బీపీసీఎల్‌ 7 శాతం, ఐవోసీ 8 శాతం ఎగిశాయి. బీఎస్‌ఈలో చివరికి హెచ్‌పీసీఎల్‌ షేరు సుమారు 15 శాతం పెరిగి రూ. 207.15 వద్ద, బీపీసీఎల్‌ 5 శాతం పెరుగుదలతో రూ. 278.65, ఐవోసీ 5 శాతం పెరిగి రూ. 131 వద్ద క్లోజయ్యాయి. పెట్రోల్‌ రేట్ల తగ్గింపు ప్రకటించినప్పట్నుంచీ ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ కంపెనీల షేర్ల ధరలు దాదాపు 20 శాతం దాకా క్షీణించాయి.