ఎట్టకేలకు  శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం!!
Spread the love

ఎలాగైనా కేరళ సర్కారు పంతం నెగ్గించుకుంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 3.45 గంటలకు ఇద్దరు మహిళలను శబరిమలలోని గర్భగుడిలోకి పోలీసుల సాయంతో తీసుకెళ్లారు. పోలీసులు మఫ్టీలో ఉండి ఆ ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలను నల్ల దుస్తులు ధరింప చేసి లైవ్ వీడియో పెట్టుకొని ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లడం విశేషం. పోలీసులు వారి వెంట ఉండి మరీ స్వామి వారి గర్భగుడిలోకి మహిళలను తీసుకెళ్లి స్వామి వారికి పూజలు చేయించారు. ఈ వీడియోలను పోలీసులు విడుదల చేశారు.

డిసెంబర్ 24న బిందు, కనకదుర్గ అనే మహిళలు స్వామి వారి దర్శనం కోసం వెళ్లగా శబరిమలలో అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరే పోలీస్ ఎస్కార్ట్ తో ఈరోజు తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో చాకచక్యంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో భక్తులు ఎవ్వరూ లేకపోవడంతో ఎవ్వరూ అడ్డుకోలేదు. నల్లటి దుస్తులు ధరించిన ఆ ఇద్దరు ముందు పంబ బేస్ క్యాంప్ నుంచి బయలు దేరారు.. పురుష వేషధారణలో రావడంతో చూసిన వారు కూడా వీరు మహిళలు అని గుర్తుపట్టలేకపోయారు.

కాగా 50 ఏళ్లలోపు మహిళలు ఇద్దరు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై అయ్యప్ప భక్తులు, బీజేపీ సహా సంప్రదాయవాదులు భగ్గుమంటున్నారు.