టీవీ ప్రసారాలు ఆగవు
Spread the love

టెలివిజన్‌ ప్రేక్షకులు చెల్లింపు ఛానళ్లను ఎంపిక చేసుకునేందుకు మరో నెల గడువు పొడిగించారు. ప్రసారాలు, కేబుల్‌ సర్వీసులపై రూపొందించిన కొత్త విధివిధానాల అమలులో భాగంగా ఇష్టమైన ఛానళ్లనే ఎంపిక చేసుకునేందుకు జనవరి 31 దాకా గడువు పొడిగిస్తున్నట్లు భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) ప్రకటించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశమయిన తర్వాత ట్రాయ్‌ కార్యదర్శి ఎస్‌కే గుప్తా ఈ విషయాన్ని తెలిపారు.

‘కొత్త విధానంలోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా మారాలి. ఇందుకోసం ఓ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన రీతిలో చానెళ్లను ఎంపిక చేసుకుని చెల్లింపులు చేసుకోవచ్చు. కేబుల్‌ ఆపరేటర్లు కూడా తమ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు. ఆ ప్రఽణాళిక వెలువడేదాకా కేబుల్‌ టీవీ ప్రసారాల్లో అంతరాయం కలగకుండా, వినియోగదారులు అన్ని చానెళ్లూ చూడగలిగేట్లు చూడాలి’’ అని ట్రాయ్‌ గురువారం నాడు వెలువరించిన ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త విధానం ప్రకారం డీటీహెచ్‌, కేబుల్‌ కనెక్షన్‌ ఉన్న టెలివిజన్‌ ప్రేక్షకులు నెలకు రూ.153 చెల్లించి 100 చానళ్లను చూడొచ్చు. వీటిని ఫ్రీ చానళ్లుగా పరిగణిస్తారు. పే చానళ్ల కోసం ప్రత్యేకంగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వాటిని కూడా ప్యాక్‌లవారీగా ఎంపిక చేసుకొని డబ్బులు కట్టే వెలుసుబాటు కల్పించారు. అయితే.. ఈ విధానం అమలుపై అనుమానాలు నెలకొనడంతో ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘న్యూ సబ్‌స్ర్కిప్షన్‌ విధానం ప్రకారం డబ్బులు చెల్లించారా? లేదా? అన్న విషయాలతో సంబంధం లేకుండా టీవీ ప్రసారాలు అందివ్వాలని సర్వీస్‌ ప్రొవైడర్లను కోరింది.