6,603 పంచాయతీ కార్యదర్శి పోస్టులు
Spread the love
  • పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఇంకా 2,719 పంచాయతీల్లో కార్యదర్శుల ఖాళీలు!
  • వివరాలు కోరిన ఆర్థిక శాఖ

రాష్ట్రంలో భారీసంఖ్యలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్‌శాఖలో 6,603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ.. ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతీ గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండాలని.. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. వీటి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుందని అధికారులు తెలిపారు. ఇటీవల కొత్తగా 4,383 పంచాయతీలను ఏర్పాటుచేయడంతో రాష్ట్రంలో గ్రామపంచాయతీల సంఖ్య 12,751కి పెరిగింది. రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీకి కార్యదర్శి ఉండాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాదాపు 9,300 గ్రామ కార్యదర్శుల నియామకాలకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. తొలిదశలో కొత్తవాటితోపాటు పాత పంచాయతీల్లో కూడా కార్యదర్శుల ఖాళీలను భర్తీచేయడానికి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ప్రతి గ్రామపంచాయతీ బలోపేతంతోపాటు పరిపాలనాపరంగా ఇబ్బందులు రాకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపడుతున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

తాజాగా 6603 పోస్టులే మంజూరు కావడంతో ఇంకా 2,719 పోస్టులు ఖాళీగా ఉండే అవకాశాలున్నాయి. అయితే కార్యదర్శుల స్థాయిలోనూ కొన్ని ఇబ్బందులున్నాయి. ప్రస్తుతం కార్యదర్శి పోస్టులు గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3, గ్రేడ్‌-4 రకాలుగా ఉన్నాయి. ఈ నాలుగు కేడర్లను రెండు కేడర్లకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం మంజూరు చేసిన 6603 జూనియర్‌ సెక్రటరీ పోస్టులు గ్రేడ్‌-4లోకి రానున్నాయి.