శబరిమల ఆందోళనలో మహిళ ఫొటో వైరల్‌
Spread the love

శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది.  గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన హిందూ సంస్థల కార్యకర్తలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లు, గ్రానైట్‌ పలకలు ఉంచి నిరసనకు దిగారు. దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్‌ పిలుపు మేరకు వందలాది మంది  హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు.

తిరువనంతపురంలో జరిగిన ఆందోళనలను కవర్‌ చేసేందుకు షాజిలా తన బృందంతో వెళ్లారు. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు మీడియా వ్యక్తులపై దాడికి దిగారు. షాజిలాపై కూడా దాడి చేశారు. ఆమె కెమెరా లాక్కొని, నెట్టేశారు. అయినాప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. ఆందోళనకారుల నుంచి కెమెరాను బలవంతంగా తీసుకుని తన రిపోర్టింగ్‌ కొనసాగించారు. దాడిలో తనకు గాయమైనా.. ఆ బాధను పంటిబిగువన పట్టి విధులు నిర్వర్తించారు. ‘నేను భయంతో ఏడ్వలేదు. నా నిస్సహాయ స్థితికి ఏడ్చాను.  ఐదారుగురు వచ్చి నాపై దాడి చేస్తే నేనేం చేయగలను. వారు దాడి చేసినందుకు కాదు నా బాధ. దాని వల్ల నేను మంచి మంచి విజువల్స్ మిస్సయ్యాను. సమయం కూడా వృథా అయ్యింది’ అని షాజిలా చెప్పుకొచ్చారు.

కన్నీటితో కెమెరా పట్టుకుని షూట్‌ చేస్తున్న షాజిలా ఫొటోను కేరళ దినపత్రిక ఒకటి ప్రచురించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ధైర్యానికి, వృత్తి పట్ల ఉన్న నిబద్ధతకు నెటిజన్లు షాజిలాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.