కేరళలోని శబరిమలలో ఉద్రికత్త…. కెమెరామ‌న్‌కు గాయాలు
Spread the love

కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం వద్ద మంగళవారం నాడు ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే 18 బంగారు మెట్ల వద్దకు ఓ మహిళ చేరుకుందని తెలియడంతో ఆలయ పరిసరాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే సదరు మహిళను ఆందోళనకారులు మెట్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఘర్షణలు చెలరేగాయి. గొడవల్లో ఓ మీడియా సంస్థకు చెందిన కెమెరామెన్‌కు గాయాలయ్యాయి.

నెలవారీ పూజల కోసం అక్టోబరులో ఐదు రోజుల పాటు ఆలయం తెరుచుకోగా పలువురు మహిళలు ఆలయంలోని ప్రవేశించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నిషేధిత వయసు మహిళలను సన్నిధానంలోకి అడుగుపెట్టనివ్వబోమని హిందూ సంఘాలు, భక్తులు హెచ్చరించి అందుకనుగుణంగానే వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీచిత్ర తిరునాళ్ ఉత్సవం కోసం ఆలయం తిరిగి తెరుచుకోవడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మహిళా భక్తులను అడ్డుకునేందుకు అయ్యప్ప భక్తులతో పాటు పలు హిందూ సంస్థల ప్రతినిధులు శబరిమలకు చేరుకున్నారు.

అయితే కుమారుడితో వ‌చ్చిన 52 ఏళ్ల మ‌హిళ‌ను పోలీసులు త‌మ అదుపులోకి తీసుకున్నారు. చిత్తిర అత్త తిరునాళ్‌ ప్ర‌త్యేక పూజ‌ల కోసం సోమ‌వారం ఆల‌యం తెరిచారు. ఇవాళ సాయంత్రం వ‌ర‌కు శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం ఉంటుంది. 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ‌య‌సున్న మ‌హిళ‌ల‌ను కూడా అనుమ‌తించాల‌ని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేప‌థ్యంలో శ‌బ‌రిమ‌ల‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. సుప్రీం తీర్పు త‌ర్వాత ఆల‌యాన్ని తెర‌వ‌డం ఇది రెండ‌వ‌సారి. శబరిమల గిరుల్లో సుమారు 5000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు శబరిమలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ 25ఏళ్ల మహిళను పంబవద్ద నిలిపివేశారు. భర్త, తన ఇద్దరి పిల్లలతో కలిసి వస్తున్న ఆమెను పోలీసులు వెనక్కు పంపారు.