నేడు రవాణా బంద్‌.. ఆటోలు, క్యాబ్‌లు కూడా బంద్‌
Spread the love

ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది. మోటారు వాహన చట్టం సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన కార్మికులు, ఆటో కార్మికులు మంగళవారం సమ్మెకు చేపట్టారు. అఖిల భారత మోటారు కార్మికుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో 80 శాతానికి పైగా ప్రభుత్వ రవాణా సంస్థల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ఆటో డ్రైవర్లు, వ్యాన్‌ డ్రైవర్లు, కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని రాష్ట్ర రవాణా కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు చెప్పారు. ప్రభుత్వ రవాణా సంస్థ కార్మికులు సమ్మెలో పాల్గొననుండటంతో ఆ సంస్థ ఉన్నతాధికారులు మంగళవారం కాంట్రాక్టు వేతనాలపై పనిచేసే కార్మికులందరూ తప్పకుండా డ్యూటీకి హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

కోటిమందికి ఇబ్బందులు..

రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 97 లక్షల మందిని ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరుస్తోంది. 24 గంటల సమ్మెకు అన్ని యూనియన్లు మద్దతు ప్రకటించిన దరిమిలా.. రాష్ట్రంలోని 98 డిపోల వద్ద నిరసన ప్రదర్శనలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ ఇంతవరకూ ప్రకటన రాలేదు. సమ్మె డిమాండ్లు రాష్ట్రం పరిధిలోనివి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ బిల్లు వల్ల ఆర్టీసీ కార్మికుల, సంస్థ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని రవాణామంత్రి మహేందర్‌రెడ్డి గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రూ. 2,600 కోట్లు అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి నేటి సమ్మెతో మరోసారి నష్టం తప్పేలా లేదు.

గ్రేటర్‌రవాణా బంద్‌

హైదరాబాద్‌లో రవాణా బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్, ఎంప్లాయీస్‌ యూనియన్, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ అనుబంధ రవాణా కార్మిక సంఘాలు, తెలంగాణ ఆటో డ్రైవర్‌ల సంక్షేమ సంఘం, తెలంగాణ ఫోర్‌ వీలర్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్, జై డ్రైవరన్న క్యాబ్స్‌ అసోసియేషన్‌ తదితర కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొననున్నాయి. దాంతో సుమారు 3,560 సిటీ బస్సులు, 1.4 లక్షల ఆటోరిక్షాలు, 2 లక్షల క్యాబ్‌లు, ట్యాక్సీలు నిలిచిపోనున్నాయి. స్కూలు బస్సులు, వ్యాన్‌లు, ఆటోరిక్షాలనూ నిలిపివేయనున్నట్లు వివిధ సంఘాల నేతలు ప్రకటించారు.

మరో వైపు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మెను విజయవంతం చేసేందుకు ఆర్‌టిసిలోని ఇతర యూనియన్లు కూడా తమ సంఘీభావాన్ని తెలిపుతూ సమ్మెకు మద్దతు నిస్తున్నాయి. గుర్తింపు సంఘం టిఎంయూతోపాటు ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ , కార్మిక పరిషత్, భారతీయ కార్మిక యూనియన్, తదితరులతో పాటు సమ్మె నోటీసు ఇవ్వకున్ననూ ఆర్‌టిసి నేషనల్ మజ్దూర్ యూనియన్‌లు కూడా సమ్మెలో పాల్గోంటున్నాయని టిఎస్ ఆర్‌టిసి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాజిరెడ్డి, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ కె. హనుమంతు ముదిరాజ్‌లు తెలిపారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్లు సైతం తమ సంఘీభావం తెలిపాయి. సరుకు రవాణా, బుకింగ్‌లను సోమ, మంగళవారం  రెండు రోజుల పాటు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా బంద్‌చేస్తామని  తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ ఎన్. భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్‌లో వెల్లడించారు.