రైళ్లలో రిజర్వేషన్‌ ఉంటేనే ఎక్కండి
Spread the love

జనరల్‌ బోగీ ఇరుకండీ.. రిజర్వేషన్‌ ఉంటేనే ఎక్కండి.. ఇలా అని రైల్వే అధికారులు మాటల్లో చెప్పడంలేదు గానీ చేతల్లో బాగా చూపిస్తున్నారు. అన్‌ రిజర్వుడ్‌ ప్రయాణికులకు సౌకర్యంగా యూటీఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చామని ఒక పక్క ఘనంగా ప్రకటించుకుంటున్న రైల్వే అధికారులు మరో పక్క జనరల్‌ బోగీలను కుదించేస్తున్నారు. బోర్డు నిబంధనలను గాల్లో కలిపేసి, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రెండు, మూడు జనరల్‌ బోగీలతోనే నడిపించేస్తున్నారు. జనరల్‌ బోగీలను కుదించి వేస్తున్న విషయం సగటు ప్రయాణికుడికి కూడా తెలియదు.

విజయవాడ డివిజన్‌ నుంచి నడిచే రైళ్లతోపాటు, విజయవాడ మీదుగా ఇతర రాష్ర్టాలకు రాకపోకలు సాగించే దూర ప్రాంత రైళ్లలో కూడా అధికారులు జనరల్‌ బోగీలను కుదించి వేస్తున్నారు. అయితే ఈ బోగీల్లో సామర్ధ్యాన్ని మించి టిక్కెట్లు జారీ చేస్తున్నారు. దాంతో ఉన్న రెండు మూడు బోగీలు ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. చంటి బిడ్డలతో ప్రయాణించే వారు, వృద్ధులు నరకాన్ని చూస్తున్నారు. పాట్నా, గౌహతి, భువనేశ్వర్‌ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కూర్చునేందుకు స్థలం లేక ప్రయాణికులు మరుగుదొడ్లలో కూడా కూర్చుని ప్రయాణిస్తున్న దుస్థితి. ఈ పరిస్థితులన్నింటికీ కారణం జనరల్‌ బోగీలను తగ్గించటమే.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రిజర్వేషన్‌ బోగీలు, లగేజీ బోగీలకు ఇస్తున్న ప్రాధాన్యత జనరల్‌ బోగీలకు అధికారులు ఇవ్వటం లేదు. దాంతో డిమాండ్‌కు అనుగుణంగా జనరల్‌ బోగీలు సరిపోక.. ఉన్న బోగీల్లోనే కిటకిటలాడుతూ సామాన్యులు కష్టాల ప్రయాణం సాగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అతి పెద్దదైన విజయవాడ జంక్షన్‌ మీదుగా రోజుకు 400 పైబడి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.