ఈరోజు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Spread the love

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ప్రత్యేక పూజల కోసం నేడు తెరుచుకోనున్నది. అన్ని వయస్సుల మహిళలు అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఆలయం తెరుచుకోవడం ఇది రెండోసారి. సోమవారం నాడు సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకుంటుంది. మంగళవారం నాడు రాత్రి 10 గంటలకు మూసివేస్తారు. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17 నుంచి 22 వరకు శబరిమల ఆలయ ద్వారాలు తెరిచినప్పుడు అయ్యప్ప దర్శనానికి ప్రయత్నించిన కొందరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

గత నెలలో మాస పూజ కోసం ఆలయం తెరుచుకున్నప్పుడు కొందరు మహిళలు వచ్చేందుకు ప్రయత్నించడంతో శబరిమల రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల రాకను నిరసిస్తూ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. దాంతో ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

పంబ, నీలక్కల్‌, ఎలవుంకల్‌, సన్నిధానం పరిసరాల్లో 72 గంటల పాటు 144సెక్షన్‌ విధించారు. మహిళా భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని మంత్రి వెల్లడించారు.. కాగా ఇప్పటివరకూ 50ఏళ్ల లోపు మహిళలెవరూ భద్రత కోసం సంప్రదించలేదని పోలీసులు తెలిపారు.

యువ మహిళా జర్నలిస్టులను వార్తల నిమిత్తం శబరిమలకు పంపవద్దని పలు హిందూ సంస్థలు, అయ్యప్ప భక్తుల సంఘాలు మీడియా సంస్థలను కోరాయి. గతనెలలో జరిగిన ఉద్రిక్త ఘటనల్లో పలువురు మహిళా జర్నలిస్టులు గాయపడిన విషయం తెలిసిందే. కాబట్టి విశ్వహిందూ పరిషత్, హిందూఐక్యవేదిక వంటి పలు సంస్థలతో కూడిన శబరిమల కర్మసమితి ఈ మేరకు మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసారు.