పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాహుల్…!
Spread the love

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా.. ఏ మీడియా సమావేశంలో పాల్గొన్నా.. తప్పనిసరిగా వచ్చే ప్రశ్న.. ఆయన పెళ్లి గురించి. తాజాగా హైదరాబాద్లో పర్యటిస్తున్న ఆయనకు మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది. దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా అభివర్ణించే రాహుల్ ను.. పెళ్లిపై మరోసారి ప్రశ్నలు వేశారు. దీనిపై ఆయన గతంలో ఎప్పుడూ లేనట్లుగా.. ఊహించనిరీతిలో రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీతో తన వివాహం జరిగిపోయిందని చమత్కరించారు రాహుల్ గాంధీ. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా ఎడిటర్ల సమావేశంలో… తన పెళ్లిపై ఇలా వ్యాఖ్యానించి..ఇక భవిష్యత్తులో తనింతే అన్న విషయాన్ని తేల్చేశారు. మీడియావాళ్ళు మళ్ళీ దీన్ని పొడిగిస్తారేమోననుకుని.. ఆయన వెంటనే రాజకీయాల ప్రస్తావన తెచ్చారు. ప్రస్తుతం 48 సంవత్సరాల వయసున్న రాహుల్ ను ఇకపై పెళ్లి మాట ఎత్తాల్సిన అవసరం లేదేమో? రెండో రోజున బిజీబిజీగా గడుపుతున్న రాహుల్.. తాను బస చేసిన హరిత ప్లాజాలోనే పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

2019లో మోదీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవని, ఆయన ఊహల్లోనే బతుకుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీకి 230 సీట్లు రాకుంటే మోదీ ప్రధాని కాలేరు. ఆ సందర్భంలో ఆ పార్టీ మరొకరిని ప్రధానిగా ప్రతిపాదిస్తుంది అని ఆయన చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లో మొదట పార్టీ ముఖ్యనేతలతోను, ఆ తరువాత 90 మంది మీడియా ఎడిటర్లు, జర్నలిస్టులతోను రాహుల్ సమావేశమయ్యారు.