కరీంనగర్‌లో రాష్ట్రపతి పర్యటన
Spread the love

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రం, శివారులో విస్తృత ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం నాడు ఉదయం 10.40 గంటలకు నగునూర్ చేరుకోనున్న రాష్ట్రపతి.. ప్రతిమ వైద్యకళాశాలలో నిర్మించిన ఆడిటోరియంతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు ప్రతిమ మెడికల్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో 11 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. అనంతరం మెడికల్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. 11.45 గంటలకు కోవింద్‌ తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, తెలంగాణ గవర్నర్ నరసింహన్ కూడా ప్రసంగిస్తారు.

కరీంనగర్‌లో రాష్ట్రపతి ప్రయాణించే హెలికాఫ్టర్‌తో ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు, నిఘా వర్గాలు ఇక్కడ పహారా కాస్తున్నాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇక్కడ రాష్ట్రపతి గంటకు పైగా సమయాన్ని వెచ్చిచ్చనున్నారు. ఇక్కడ ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన ఆడిటోరియంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత 10:57 గంటలకు ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకుంటారు.