ఇది బ్లాక్‌మెయిల్‌.. మేం చూస్తూ ఊరుకోం: చైనా
Spread the love

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి మళ్లీ తెరలేచింది. 50 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ నిర్ణయానికి దీటుగా స్పందించిన చైనా.. అమెరికా ఉత్పత్తులపై అదే స్థాయిలో సుంకాలను పెంచింది. ఇదిలా ఉండగా.. చైనా ఉత్పత్తులపై అదనపు టారిఫ్‌లను విధిస్తామని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు.

200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 10శాతం సుంకాలను విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాలను పెంచినందుకే తాము ఈ నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటున్నట్లు అమెరికా పేర్కొంది. ‘అమెరికాతో సమతుల్య వాణిజ్య సంబంధాలను అంగీకరించే దిశగా చైనా విధానాల్లో మార్పు తెచ్చేందుకు తదుపరి చర్యలు చేపడుతాం’ అని ట్రంప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా.. అమెరికా హెచ్చరికలకు చైనా అదే స్థాయిలో బదులిచ్చింది. అదనపు టారిఫ్‌ల పేరుతో అమెరికా బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని ఆరోపించింది. ఒకవేళ చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలను విధిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. దానికి దీటుగా చర్యలు చేపట్టందుకే తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా పేర్కొంది. అమెరికాకు బదులిచ్చేందుకు అంతకంటే వేరే అవకాశం తమకు లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.