రానున్న ఎలక్షన్ లో  బిజెపి, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం: ప్రాంతీయ పార్టీలే
Spread the love

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. బీజేపీ సహా ఎన్డీఏ కూటమి రాను రాను బలహీన పడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ బలపడుతున్నా… అంత కంటే ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు బలపడిన సూచనలు కనిపిస్తున్నాయి. అంటే.. 2019 తర్వాత ఎవరు అధికారంలోకి రావాలన్నా ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర. అందుకే ప్రధానమంత్రి అభ్యర్థులపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. చివరికి బీజేపీలో కూడా మోదీ కాకపోతే ఎవరు అన్న ప్రశ్న కూడా వస్తోంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పడాలంటే.. ప్రాంతీయ పార్టీలు .. ఏదో ఓ జాతీయ పార్టీకి మద్దతివ్వాలి…లేదా.. ఏదో ఓ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతివ్వాలి. రెండింటిలోనూ… ప్రాంతీయ పార్టీలే కీలకం.

ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి. కానీ.. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మాత్రం ప్రధానమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ … వీరంతా.. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వీరిలో చాలా మందికి స్వయంగా ప్రధానమంత్రి పదవిపై ఆశలు ఉండటం ఓ కారణం అయితే.. రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తే.. తమ తమ రాష్ట్రాల్లో బలహీన పడిన కాంగ్రెస్ ఎక్కడ బలపడుతుందోననేది మరో ఆందోళన.

ఈ పరిస్థితి ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. బీజేపీలోనూ ఉంది. బీజేపీలో శిఖరంలా కనిపిస్తున్న మోదీకి కూడా ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఎన్డీఏ ఇప్పుడు పూర్తి స్థాయిలో బలహీనపడింది. బీజేపీకి తప్ప… రెండు అంకెల సీట్లు సాధించే పార్టీలు ఎన్డీఏలో లేవు. బీజేపీకి వంద సీట్లు తగ్గిపోతే.. మిత్రపక్షాలు పది, ఇరవై సీట్లు కూడా భర్తీ చేయలేవు. అంత కన్నా తగ్గితే కష్టమే. కొత్తగా మిత్రులు ఎవరూ రారు. రావాలంటే.. అలాంటి పార్టీల ప్రధాన డిమాండ్… మోదీని ప్రధానమంత్రి కాకూడదనే.

అందుకే.. ఇప్పుడు.. కొత్తగా వచ్చే మిత్రుల కోసం అయినా ఓ నేతను సిద్ధం చేయాల్సిన పరిస్థితి బీజేపీకి… ఆ పార్టీ విధానాలను నిర్ణయించే ఆరెస్సెస్ కు ఏర్పడింది. ఈ క్రమంలో ఆరెస్సెస్ తో అత్యంత సన్నిహితంగా ఉండే గడ్కరీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్లు తెర మీదకు వస్తున్నాయి. జాతీయ స్థాయి నేతలిద్దరికి.. సంపూర్ణ ఆమోదం మాత్రం ప్రాంతీయ పార్టీల నుంచి లభించడం లేదనే చెప్పాలి.