తుమ్మలూరులో ప్లాస్టిక్ పార్కు…
Spread the love

రంగారెడ్డి జిల్లాలోని తుమ్మలూరులో ప్లాస్టిక్‌పార్కు స్థాపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఇందుకోసం 110 ఎకరాల భూమిని కేటాయించినట్టు వెల్లడించారు. కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాకపోయినా పార్కు అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. ప్లాస్టిక్ పరిశ్రమలు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షిత, సుస్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు . హైదరాబాద్ హైటెక్స్‌లో నాలుగు రోజలపాటు నిర్వహించే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్‌పొజిషన్ సదస్సును మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలూరులో రూ.123 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటుచేయ తలపెట్టిన ప్లాస్టిక్ పారిశ్రామికవాడ వల్ల ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. అతి త్వరలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు స్థలాలు కేటాయిస్తామన్నారు. పార్కులో మౌలిక సదుపాయల అభివృద్ధికి ఇంతవరకు రూ.25 కోట్లు ఖర్చు చేసినట్టు కేటీఆర్ వివరించారు. .

ప్లాస్టిక్స్‌ భవన్‌ కోసం రెండు వేల చదరపు మీటర్ల స్థలాన్ని ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు టాప్మా అధ్యక్షుడు వేణుగోపాల్‌ జాస్తి విన్నవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్, పెట్రో కెమికల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కుమార్‌ వర్మ, ఆలిండియా ప్లాస్టిక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హిటెన్‌ బెడా, వివిధ కంపెనీల నిర్వాహకులు పాల్గొన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విప్లవాత్మక విధానం టీఎస్‌ఐపాస్‌ను అమలులోకి తెచ్చి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంలో 14 రంగాలపై ప్రధానంగా దృష్టి సారించామని, అందులో ప్లాస్టిక్ పరిశ్రమ ఒకటని పేర్కొన్నారు. హైదరాబాద్ లోపల, బయట కలిపి ఆరువేల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లున్నాయని, గత రెండేండ్లుగా ప్లాస్టిక్ పరిశ్రమల వల్ల రాష్ర్టానికి వేయికోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, రెండువేల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. ప్రతి ఏటా దక్షిణాది రాష్టాల్లో 2.5 మిలియన్ యుఎస్ డాలర్ల విలువచేసే ప్లాస్టిక్ పాలిమర్ వినియోగం ఉండగా, అందులో 18%-20% వినియోగం తెలంగాణలోనే ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో 9 లక్షల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తవుతున్నాయని, ఇందులో మైక్రో యూనిట్లు 28%, చిన్న యూనిట్లు 55%, మధ్యతరహా పరిశ్రమలు 15%, భారీ పరిశ్రమలు 2% ఉత్పత్తిచేస్తున్నాయని చెప్పారు.. ఐప్లెక్స్‌ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ అనిల్‌రెడ్డి వెన్నం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్‌ ఎగ్జిబిషన్‌లో 350 స్టాల్స్‌ ఏర్పాటు చేశారని, 50 వేల మంది సందర్శకులు వీక్షించనున్నారని చెప్పారు. వంద మిలియన్ల అమెరికన్‌ డాలర్ల వ్యాపా రం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలవల్ల అనర్థాలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు.

తాజాగా పట్టణప్రాంతాల్లో ప్రమాదకర ప్లాస్టిక్ వినియోగాన్ని పరిమితంచేసేందుకు మంత్రిగా ఆదేశాలు జారీచేశానన్నారు. తమ ప్రభుత్వం ప్లాస్టిక్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఐప్లెక్స్-18 కన్వీనర్ వేణుగోపాల్ జాస్తి, డైరెక్టర్ జనరల్ ఎస్కే నాయక్, అడ్వయిజరీ కమిటీ చైర్మన్ అనిల్‌రెడ్డి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (పెట్రోకెమికల్స్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ చౌదరి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టాప్మా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ శివగుప్తా తదితరులు సదస్సులో మాట్లాడారు.