25 నుంచి రెండో విడత ప్రజాపోరాట యాత్ర
Spread the love

పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన రెండో విడత ప్రజాపోరాట యాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నారు. పవన్‌ 25వ తేదీన ఏలూరు నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారు.పవన్‌ కల్యాణ్‌ పర్యటనను హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన జెఎస్‌పీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అధికారికంగా ప్రకటించింది. జిల్లాలో తొలి అడుగు భీమవరం నుంచి ఆగస్టులో నిర్వహించిన పవన్‌ కల్యాణ్‌ తన మలి అడుగు ఏలూరు నుంచి వేసేందుకు సన్నద్ధం అయ్యారు. ఏలూరులో బహిరంగ సభను నిర్వహిస్తారు. వివిధ వర్గాల ప్రజలతో ఆయన విడివిడిగా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఏలూరులో యాత్ర అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు  నిర్వాసితులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం ప్రాజక్టు ముంపు గ్రామాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే నిర్వాసితులు తమకు న్యాయం జరగలేదని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ పోలవరం నిర్వాసితులతో భేటీ అవ్వాలని నిర్ణయించారు. పోలవరం అనంతరం ఆయన చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, ఉంగుటూరు నియోజకవర్గాలలో పర్యటించి ఆయా నియోజకవర్గాలలో బహిరంగ సభలలో ప్రసంగిస్తారు.

హైదరాబాద్‌లో భేటీ అయిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ, రాష్ట్ర సమన్వయకర్తల సమావేశంలో ఆయా జిల్లాల జనసేన కమిటీల ఎంపిక విషయం కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా కమిటీకి సంబంధించి 30 నుంచి 50 మందితో కూడిన కమిటీ ప్రతిపాదనను పవన్‌కల్యాణ్‌కు నాయకులు అందచేశారు. ఏలూరు పర్యటన సందర్భంగా ఆయన జిల్లా కమిటీని ప్రకటిస్తారని పార్టీ రాష్ట్ర నాయకులొకరు విశాలాంధ్ర ప్రతినిధికి చెప్పారు. అయితే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకువెళ్ళే రీతిలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ముందు జిల్లా కమిటీ నియామకం అనంతరం ఎన్నికల అంశం పరిశీలించవచ్చని ఆ నాయకుడు చెప్పారు. పశ్చిమ పర్యటన అనంతరం పవన్‌ కల్యాణ్‌ తూర్పు గోదావరి పర్యటన ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లా కమిటీల తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీలను ప్రకటించనున్నట్టు సమాచారం.