పశ్చిమలో తుది దశకు చేరుకున్న జనసేన ప్రజా పోరాట యాత్ర!!
Spread the love

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర తుది దశకు చేరుకుంది. ఈ నెల 9వ తేదీన కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకూ గోదావరి నదిపై ఉన్న రోడ్ కమ్ రైల్ వంతెనపై వేలాదిమంది జన సైనికులతో కవాతు నిర్వహించాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు తగిన ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నేతలు జంగారెడ్డిగూడెంలో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 9వ తేదీతో పశ్చిమలో యాత్ర ముగుస్తుంది. 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి వేలాదిమంది జన సైనికులతో కలసి పవన్ కల్యాణ్ కొవ్వూరు నుంచి రాజమండ్రికి కవాతు చేస్తారు. రాజ‌మండ్రి బ్రిడ్జి క‌వాతుని విజ‌య‌వంతం చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. క‌వాతుకి ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి వేలాదిగా శ్రేణులు తరలి వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున త‌గిన ఏర్పాట్లు చేసే ప‌నిలో నిమ‌గ్నమ‌య్యారు. ఇందుకోసం వివిధ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క‌వాతుని విజ‌య‌వంతం చేయ‌వ‌ల‌సిందిగా పార్టీ శ్రేణుల‌కి జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.