టీడీపీకి జనసేన మద్దతుపై.. పవన్ వ్యాఖ్యాలు!
Spread the love

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో.. జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వకుండా ఉన్నట్లయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యేవారని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చాను, తప్పు చేశానని బాధపడుతున్నానన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సౌభాగ్య సెంటర్‌ బహిరంగసభలో పవన్  మాట్లాడారు. టీడీపీ నాయకులు రూ.వేల కోట్లు దోచుకుతింటున్నారని, సీఎం చంద్రబాబు డబ్బే ప్రధానంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీ ప్రధాని అయ్యేవారని అన్నారు.

జంగారెడ్డిగూడెం నుంచి ఐఎస్‌ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ట్రాఫిక్‌ లేని సమయంలో 14 కిలోమీటర్లు వెళ్లేందుకు తనకు 40 నిమిషాలు పట్టిందని, దీన్నిబట్టి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందని పవన్‌ అన్నారు. చింతలపూడి పథకంలో రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వట్లేదని తప్పుపట్టారు. టీడీపీ నాయకులకైతే ఎకరానికి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఇస్తున్నారని, పేదల భూములకు రూ.10 లక్షలనుంచి రూ.12 లక్షలిచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. సేంద్రీయ వ్యవసాయానికి అమెరికా వెళ్లి రూ.వేల కోట్లు అప్పులు తెస్తున్న చంద్రబాబు ఆ అప్పును ఎవరు తీరుస్తారో చెప్పాలని పవన్‌ అంటూ.. మీ అబ్బాయి కడతారా? అని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం టౌన్‌హాల్‌లో గతంలో మంచి కార్యక్రమాలు జరిగేవని, దాన్ని పేకాట క్లబ్‌గా మార్చిన ఘనత టీడీపీదన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఓట్లను టీడీపీ తొలగించిందని, వీటిలో 19 లక్షల ఓట్లు జనసేన పార్టీకి చెందినవేనన్నారు.