నేడే తలాక్‌ బిల్లుపై కీలక నిర్ణయం
Spread the love

బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్‌ తలాక్‌బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. తీవ్ర విమర్శల నడుమ లోక్‌సభలో ఆమోదం పొందిన తలాక్‌ బిల్లు కీలకమైన రాజ్యసభ ఆమోదం కొరకు ఎదురుచూస్తోంది. బిల్లును అడ్డుకుంటామని కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్షాలు ఘంటాపథకంగా చెప్పి, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత తీర్మానంపై 11 పార్టీలు సంతకం చేశాయి. చర్చకు ముందు తీర్మానంపై ఓటింగ్‌ జరగాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని తెలిసిందే

ఇక ప్రతిపక్షాల ఆందోళనలు ఒకవైపు, రాజ్యసభలో అధికార పార్టీకి సంఖ్యాబలం లేకపోవడం మరోవైపు బీజేపీకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ కీలకమైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితేనే చట్టంగా మారనుంది. ఇదిలావుండగా సోమవారం జరిగి రాజ్యసభ సమావేశాలను సభ్యులందరూ హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు విప్‌లను జారీచేశాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఎత్తుగడలను పెద్దలసభలో బీజేపీ ఎలా ఎదుర్కొంటనేది చూడాలి.