నరసాపురం నుంచి బెంగళూరుకు కొత్త ఎక్స్‌ప్రెస్…
Spread the love

నరసాపురం నుంచి బెంగళూరుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రతిపాదించారు. ప్రస్తుతం ధర్మవరం నడుస్తున్న రైలును బెంగళూరు వరకు నడపాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలను రైల్వే బోర్డు పరిశీలనకు పంపారు. ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం నరసాపురం నుంచి ధర్మవరానికి లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. మచిలీపట్నం నుంచి వచ్చే బోగీలను గుడివాడలో జత చేసి దీన్ని నడుపుతున్నారు. తిరుపతి మీదుగా వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్‌లో నరసాపురం నుంచి కేవలం ఎనిమిది బోగీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ రైల్లో టిక్కెట్‌ దొరకడమే కష్టంగా మారింది. లింక్‌ను తొలగించి పూర్తిస్థాయి రైలును నడపాలని గత కొన్నేళ్ల నుంచి జిల్లా ప్రజా ప్రతినిధులు రైల్వే బోర్డుకు విన్నవిస్తున్నారు. ఇదే తరుణంలో దక్షణ మధ్య రైల్వే లింకు ఎక్స్‌ప్రెస్‌లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దశాబ్దాలుగా నడుస్తున్న సింహాద్రి లింక్‌ను తొలగించారు. ఇక మిగిలింది తిరుపతి, నరసాపురం, విశాఖ పాస్ట్‌ ప్యాసింజర్లు.

నరసాపురం నుంచి తిరుపతి వెళ్లే రైలుకు డిమాండ్‌ ఉండటంతో 18 కోచ్‌లతో తిరుపతి మీదుగా బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపాలని ప్రతిపాదించారు. దీని వల్ల తిరుపతి, బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని యోచిస్తున్నారు. ప్రస్తుతం నరసాపురం నుంచే వెళ్లే లింక్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఒక టూటైర్‌, మరో ఏసీ త్రీటైర్‌, ఆరు స్లీపర్‌, రెండు జనరల్‌ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. పూర్తి రైలు నడపాలంటే అదనంగా మరో ఎనిమిది కోచ్‌లు కావాల్సి ఉంది. దీంతో పాటు బెంగళూరు వరకు పొడిగించాలంటే ఈ తరహా మూడు రైళ్లు కావాలి. సాయంత్రం బయలుదేరే రైలు బెంగళూరుకు వెళ్లే సరికి మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. తిరిగి ఇదే రైలు బయలుదేరి రావడం సాధ్యం కాదు. దీంతో మూడు రైళ్లు ఉంటేగాని పూర్తిస్థాయిలో నడపడం సాధ్యం కాదు. ఇక మచిలీపట్నంకు లింకు కూడా ఉండదు. ప్రస్తుతం అక్కడ నుంచి బెంగళూరుకు వారంలో రెండు రోజులు రైలు ఉంది. దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ నేరుగా ధర్మవరం వెళ్లిపోతుంది. ఇటు నరసాపురం నుంచి బయలుదేరే రైలు నేరుగా బెంగళూరు వెళుతుంది.

అయితే ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌ప్రవేశపెడితే ఇదే రూట్‌లో శేషాద్రిని ఏంచేయాలన్న దానిపై రైల్వే అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ రైలు కాకినాడ నుంచి తణుకు, భీమవరం మీదుగా నడుస్తుంది. దీన్ని ఇదే రూట్‌లో నడపాలా లేక మెయిన్‌లైన్‌లో రూట్‌ మార్చాలా అన్న దానిపై సమాలోచన చేస్తున్నారు. ఒకవేళ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు పచ్చ జెండా ఊపితే శేషాద్రిని నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం మీదుగా నడిపే అవకా శాలున్నాయని రైల్వే అధికారులు అంటున్నారు.