ఎంపీనే ఐడీ కార్డు అడుగుతావా?
Spread the love

నన్నే గుర్తింపు కార్డు అడుగుతావా? అంటూ టోల్‌ప్లాజా సిబ్బందిని ఓ భాజపా ఎంపీ చితక్కొట్టించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం నాడు మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పర్యటించి, తమ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్న భాజపా ఎంపీ నందకుమార్‌ సింగ్‌ చౌహాన్‌.. శుక్రవారం నాడు తన అనుచరులతో కలిసి వాహనాల్లో టోల్‌ప్లాజా మీదుగా వెళుతున్నారు. కాబట్టి, వారి గుర్తింపు కార్డులను చూపించాలని టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన నందకుమార్‌ సింగ్.. తన అనుచరులతో ఈ దాడి చేయించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై టోల్‌ప్లాజా ఉద్యోగి ఒకరు మీడియాతో మాట్లాడుతూ తమ సహోద్యోగులు ఇద్దరిని కొందరు చావబాదారని, తమను ఎవరు కొడుతున్నారో కూడా వారికి తెలియదని తెలిపారు. ఎంపీనే ఐడీ కార్డు అడుగుతావా? అనే మాటలు మాత్రం వారికి వినపడ్డాయని చెప్పారు. ఆ టోల్‌ప్లాజా మేనేజర్‌ మహేంద్ర సింగ్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ‘గుర్తింపు కార్డులు చూపించడానికి బదులుగా సిబ్బందిని దూషిస్తూ వారిపై దాడి చేశారు. టోల్‌ప్లాజా కార్యాలయం వెలుపలే కాకుండా లోపలికి వచ్చి కూడా కొట్టారు’ అని చెప్పారు. వారిపై దాడి చేయించిన చౌహాన్‌.. గతంలో మధ్యప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఖండ్వా నియోజక వర్గ ఎంపీగా ఉన్నారు. ఈ ఘటనపై స్పందించమని మీడియా కోరగా అందుకు ఆయన నిరాకరించారు.