మహారాష్ట్ర బంద్ కొనసాగుతోంది
Spread the love

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చేపట్టిన మహారాష్ట్ర బంద్ కొనసాగుతోంది. బంద్ పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది. విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ ఔరంగాబాద్‌లో ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో మరాఠా వర్గానికి చెందిన వారు బంద్‌కు పిలుపునిచ్చారు.

రహదారులపై టైర్లను తగలపెట్టి వాహనాలను అడ్డుకున్నారు. ఘన్ సోలి వద్ద రవాణా బస్సులపై రాళ్లు రువ్వి విధ్వంసం సృష్టించారు. ఉద్రిక్తంగా మారిన బంద్ నేపథ్యంలో ఐరోలీ నుంచి వాషి వరకు ప్రభుత్వం బస్సు సర్వీసులను నిలిపివేసింది. బంద్ నేపధ్యంలో ముంబయి, ఔరంగాబాద్ చుట్టు పక్కల జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఔరంగాబాద్ లో అగ్నిమాపక వాహనానికి ఆందోళనాకారులు నిప్పు పెట్టారు. దీనితో మంగళవారం ఆందోళనకారులు రాళ్లు రువ్విన ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు.

బంద్‌ నేపధ్యంలో ముంబయి నగరంపై తీవ్రంగా పడింది. ప్రజారవాణ స్తంభించిపోయింది. ఆందోళనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో పలువురు ఓలా, ఉబర్‌ క్యాబ్‌ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు.

ముంబై బంద్ హింసాత్మకంగా మారింది. థానేలో రైళ్లను అడ్డుకున్నారు. రైలు పట్టాలపైకి ఆందోళనకారులు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరాఠా సమాజ్‌కు రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తున్న మరాఠా క్రాంతి మోర్చాకు మద్దతు పలకాలని దుకాణదారులకు ఆ పార్టీ కార్యకర్తలు చేతులెత్తి దండం పెడుతున్నారు. లాతూర్ జిల్లాలోని ఉద్గిర్‌లో బలవంతంగా దుకాణాలను మూసివేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలు చోట్ల బస్సులను ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లను కాలబెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు ఆందోళనకారులు.