ట్రిపుల్‌ తలాక్‌  బిల్లుకు లోక్‌సభ ఆమోదం !!
Spread the love

ట్రిపుల్‌ తలాక్‌ అంటే : తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయం ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణించే తాజా బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2018 పేరిట తెచ్చిన ఈ బిల్లుకు 245 మంది సభ్యులు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించేందుకు జాయింట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల వినతిని కేంద్రం తోసిపుచ్చడంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు మధ్యలోనే సభ నుంచి వాకౌట్‌ చేశాయి. తాజా బిల్లుతో ఇంతకు ముందే లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో అపరిష్కృతంగా ఉన్న పాత బిల్లు రద్దయింది.

దీంతో ఏడాది వ్యవధిలో ఒకే బిల్లు రెండుసార్లు లోక్‌సభ ఆమోదం పొందినట్లయింది. ఇక తాజా బిల్లు తదుపరి దశలో రాజ్యసభ ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా గట్టెక్కి రాష్ట్రపతి ఆమోదముద్ర లభిస్తే చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ప్రకారం.. తక్షణ విడాకులు కోరుతూ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడం నేరం, చట్ట విరుద్ధం. ఆ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రూపొందించారన్న విపక్షాల వాదనల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది.