కర్నాటక ఫలితాల్లో తొలి గెలుపు బీజేపీదే
Spread the love

మంగళవారం ఉదయం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 222 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది, ఇప్పటి దాకా వెలువడిన సమాచారం ప్రకారం కాంగ్రెస్, బీజేపీల హద్య హోరాహోరీ పోరు నెలకుంది. ప్రస్తుతం బీజేపీ 119 స్థానాల్లో, కాంగ్రెస్‌ 71 స్థానాల్లో, జేడీఎస్‌ 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ తన ఉనికిని చాటుకుంటోంది. సీఎం సిద్ధరామయ్యకు ప్రజా వ్యతిరేకత తగిలినట్టుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చాముండేశ్వరిలో ప్రజలు తమ ఓటు ద్వారా నిరూపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. తన సమీప ప్రత్యర్థి, జేడీఎస్‌కు చెందిన జీడీ దేవెగౌడ కంటే సిద్ధరామయ్య 11 వేల పైచిలుక ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

బెంగుళూరు సిటీలో బిజెపి ఆధిక్యత కొనసాగుతోంది. బదామిలో బిజెపి అభ్యర్థి శ్రీరాములు ఆధిక్యంలో ఉన్నారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర వరుణ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.కర్నాటకలో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బళ్లారిలో గాలి సోదరుల హవా కొనసాగుతోంది. అంచనాలకు మించి జెడి(ఎస్‌) ఫలితాలను కైవసం చేసుకుంటోంది. జెడిఎస్‌తో కాంగ్రెస్‌ మంతనాలు జరుపుతున్నట్లు వార్తలస్తున్నాయి. బాగేపల్లిలో బిజెపి అభ్యర్థి, సినీ నటుడు సాయికుమార్‌ వెనుకంజలో ఉన్నారు. శికారిపురా నియోజకవర్గంలో బిజెపి సిఎం అభ్యర్థి యడ్యూరప్ప ముందంజలో ఉన్నారు. బెంగళూరు నగరంలో ఆధిక్యత చూపగా, హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ ముందుంజలో ఉంది.

ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తుంటే, అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఎవరూ పార్టీ కార్యాలయం వద్ద కనిపించడం లేదు. ఫలితాల సరళి పూర్తిగా చూసిన తరువాతే పార్టీ కార్యాలయానికి వెళ్లాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయం నడిపేందుకు బెంగళూరుకు వచ్చిన గులాంనబీ ఆజాద్ ప్రస్తుతానికి హోటల్‌కే పరిమితం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ కీలకం కానుందని ఫలితాలు సరళిని బట్టి తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ ముఖ్యనేతలతో ఆజాద్ మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

దీంతో సహజంగానే కింగ్‌ మేకర్‌గా నిలిచే అవకాశమున్న జేడీఎస్‌పై అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతానికి 43 స్థానాలతో జేడీఎస్‌ శక్తిమంతంగా కనిపిస్తోంది. హంగ్‌ ఏర్పడితే.. ఆ పార్టీ మద్దతు కోసం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ బేరసారాలు చేయకతప్పదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి.. జేడీఎస్‌ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. దీంతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ నేతలు జేడీఎస్‌ను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల పెద్దలు, దూతలు రంగంలోకి దిగి.. జేడీఎస్‌ను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జేడీఎస్‌ అధినేత మాజీ ప్రధాని దేవెగౌడను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పెద్దలు రంగంలోకి దిగగా.. అటు బీజేపీ నేతలు కూడా రహస్యంగా జేడీఎస్‌తో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్‌ నుంచి అశోక్‌ గెహ్లాట్‌, గులాం నబీ ఆజాద్‌ రంగంలోకి దిగగా.. ఇటు బీజేపీ నుంచి కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ రంగంలోకి దిగారు. బీజేపీ అధినాయకత్వం తరఫున ఆయన హుటాహుటిన బెంగళూరు బయలుదేరినట్టు సమాచారం.

బీజేపీ: ఆధిక్యం: 1o7, గెలుపు: 001

కాంగ్రెస్: ఆధిక్యం: 072, గెలుపు: 000

జేడీఎస్: ఆధిక్యం: 043, గెలుపు: 000

ఇతరులు: ఆధిక్యం: 002, గెలుపు: 000