ప్రధాని ఫిట్‌నెస్‌ పై రిట్వీట్‌ చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి..
Spread the love

ప్రధాని నరేంద్రమోదీ ఫిట్‌నెస్‌ వీడియోపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కామెంట్‌ చేశారు. కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ప్రారంభించిన ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ..మోదీకి ఫిట్‌నెస్‌ సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో మోదీ యోగా చేస్తున్న వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..ఛాలెంజ్‌కు కుమారస్వామితో పలువురు క్రీడాకారులను నామినేట్‌ చేశారు.

మోదీ సవాల్‌పై కుమారస్వామి వెంటనే ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘డియర్‌ మోదీజీ..నా ఆరోగ్యం గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు. శారీరక ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. ఈ ఛాలెంజ్‌కు నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. నా వర్క్‌ అవుట్‌లో భాగంగా యోగా, ట్రెడ్‌మిల్ రోజూ చేస్తుంటాను. కానీ నా రాష్ట్రం ఫిట్‌నెస్‌ను అభివృద్ధి చేయడం గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఇందుకు మీ మద్దతు కావాలి.’ అని ట్వీట్‌ చేశారు.

దేశవ్యాప్తంగా ఈ ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌ వైరల్‌ అవుతోంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా ఫిట్‌నెస్‌ వర్క్‌ అవుట్లు చేసి ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ తమ స్నేహితులను నామినేట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లో అనుష్కశర్మ, సమంత, నాగచైతన్య, నాగార్జున, అఖిల్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ఉపాసన తదితరులు పాల్గొన్నారు.