కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం
Spread the love

కర్ణాటక రాష్ర్ట 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వాలా.. యడ్యూరప్పతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. 2007లో ఒకసారి, 2008లో మరొసారి యడ్యూరప్ప సీఎంగా చేశారు. ఆయన ఇప్పటివరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడ్యూరప్ప ఒక్కరే నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. యెడ్డీ ప్రమాణం అనంతరం బీజేపీ కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై.. మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు.

తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలను సాధించి.. అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, మెజారిటీకి ఆ పార్టీ 8 స్థానాల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పటికీ… గవర్నర్‌ వజుభాయ్‌ వాలా మాత్రం మొదట యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు యడ్యూరప్ప గవర్నర్‌ 15 రోజుల సమయం ఇచ్చారు. సుప్రీంకోర్టులో సైతం యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి లైన్‌క్లియర్‌ అయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భాజపాను ఆహ్వానించారు. దీంతో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ఈరోజు ఉదయం 9 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ఈ రకమైన పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అక్కడకు బీజేపీ ముఖ్యనేతలు, ప్రధాన కార్యకర్తలు చేరుకున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు యడ్యూరప్ప సంజయ్ నగర్ లోని రాధాకృష్ణ టెంపుల్‌ను సందర్శించారు. యడ్యూరప్ప మండ్య జిల్లా కృష్ణరాజపేట బూకనకెరులో 1943 ఫిబ్రవరి‌ 27న రైతు కుటుంబంలో జన్మించిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కార్యకర్తగా పనిచేశారు. పీయూసీ వరకు చదువుకుని సాంఘిక సంక్షేమ శాఖలో ఫస్ట్‌ డివిజన్‌ గుమాస్తాగా 1965లో నియమితులయ్యారు. ఆ తర్వాత శివమొగ్గలో ఇనుప సామాన్ల వ్యాపారాన్ని ఆరంభించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. రైతునేతగా కూడా పేరుగాంచారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆయన 1970లో శికారిపుర సంఘ్‌ పరివార్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1975లో శికారిపుర పురపాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.