దేశంలోకి జైషే ఉగ్రవాదులు… దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌!
Spread the love

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చొరబడినట్లు భద్రతా అధికారులకు సమాచారం అందింది. దీంతో జమ్ముకశ్మీర్‌తో పాటు దేశ రాజధాని దిల్లీ నగరంలో భద్రతా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. పాకిస్థాన్‌, జమ్ముకశ్మీర్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటుకుని దాదాపు 20 మంది ముష్కరులు కశ్మీర్‌లోకి ప్రవేశించారని అధికారులు వెల్లడించారు. దాదాపు 12మంది జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారని, పిర్‌ పంచాల్‌ పర్వత శ్రేణుల మీదుగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వీరు ఈ నెలలోనే జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించారని నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జమ్మూకశ్మీర్, దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒకేసారి 12 మందికిపైగా ఉగ్రవాదులు దేశంలోకి రావడం ఆందోళన రేపుతోంది.

భారత్‌లోకి ప్రవేశించిన ఈ ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది మౌలానా మసూద్‌ అజహర్‌కు చెందిన జైషే ఈ మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన వారని అధికారులు తెలిపారు. దీంతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళనతో కశ్మీర్‌ సహా దిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. భద్రతా సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరించారు. సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు దేశంలో చొరబడడం చాలా అరుదని అధికారులు వెల్లడించారు. వీరు కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

.ఈ క్రమంలో జమ్మూకశ్మీర్, ఢిల్లీలో దాడులు జరిగే అవకాశముందని ఐబీ హెచ్చరికలు జారీచేసింది. 12మంది ఉగ్రవాదులు ప్రస్తుతం మూడు గ్రూపులుగా విడిపోయి.. ప్రతి గ్రూపులో నలుగురు చొప్పున ఉన్నారని, దక్షిణ కశ్మీర్‌లోని ట్రాల్‌, షోపియన్‌, పుల్వామా జిల్లాల్లో వీరు యాక్టివ్‌గా సంచరిస్తున్నారని భదత్రా  సంస్థలకు చెందిన ఓ సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లో గతవారం రోజుల్లోనే దాదాపు 12 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడులను చాలావరకు భద్రతా దళాలు తిప్పికొట్టాయి.