పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసం ఐటీ సోదాలు
Spread the love

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు. కడప, హైదరాబాద్‌లలో ఉన్న ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో శుక్రవారం నాడు ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన స్వగ్రామం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలిపారు. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా  ప్రొద్దుటూరులో సీఎం రమేశ్‌ బంధువు గోవర్ధన్ నాయుడు ఇంట్లోనూ ఐటీ సోదాలు సాగుతున్నాయి. సీఎం రమేశ్‌కి దగ్గర బంధువైన గోవర్ధన్ నాయుడు కాంట్రాక్టర్‌గా ఉన్నారు.

ఇలా నోటీసులు ఇచ్చిన మూడు రోజులకే ఏకంగా సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం గమనార్హం. శుక్రవారం నాడు ఉదయం 8 గంటల సమయంలో పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. పోట్లదుర్తిలోని సీఎం రమేశ్ ఇంటిపై దాడి చేసిన సమయంలో ఆయన సోదరుడు సీఎం సురేశ్‌ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అధికారులు ఆయన్ని బయటకు పంపించివేసి ఇంటి తలుపులు మూసివేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు అన్ని గదుల్లోనూ తనిఖీలు చేపడుతూ పలు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కక్షతోనే ఐటీ దాడులు:సీఎం రమేశ్‌

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తున్నందునే తనపై కక్షతో ఐటీ దాడులు జరిపిస్తున్నారని సీఎం రమేశ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నారు. ఐటీ దాడులతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.

గత వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరుకు చెందిన తెదేపా నేత బీద మస్తాన్‌రావు నివాసంలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు.. ఆ తర్వాత విజయవాడ, గుంటూరులోని పలు కార్పోరేట్‌ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లోనూ తనిఖీలు జరిపినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. కాబట్టి ఆ వార్తలను మంత్రితో పాటు ఐటీ అధికారులు సైతం ఖండించడంతో వివాదానికి తెరపడింది. ప్రస్తుతం సీఎం రమేశ్‌ను ఐటీ శాఖ లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తుండటంపై తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.